సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం గురించి సోమవారం పార్లమెంట్లో బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ చేసిన ఆరోపణలపై.. సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "చిత్రపరిశ్రమపై మన సభ్యుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలకు నేను సిగ్గుపడుతున్నాను" అని జయా బచ్చన్ మంగళవారం రాజ్యసభ శూన్యగంటలో ప్రస్తావించారు.
"చిత్రపరిశ్రమకు ఉన్న ప్రతిష్టను కేవలం కొంతమంది ఏ మాత్రం దిగజార్చలేరు. నిన్న మన పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు సినీఇండస్ట్రీకి సంబంధించిన వారు అయినా చిత్రపరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది. ఇది సిగ్గుచేటు."
- జయా బచ్చన్, సమాజ్వాద్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు
వినోద పరిశ్రమను కించపరిచే విధంగా కుట్రపన్నారనే ఆరోపణలతో.. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఎగువసభ శూన్యగంటలో నోటీసు ఇచ్చారు జయ. అయితే చిత్రపరిశ్రమలో పనిచేసే వ్యక్తులే సోషల్మీడియాలో దాని విలువ దిగజారుస్తున్నారని ఆమె తెలిపారు. అయితే పార్లమెంటులో సోమవారం ఓ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరించడం లేదని.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం నిలువరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జయా బచ్చన్.
నాకు మద్దతు ఇస్తారని భావించా..
జయా బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన భాజపా ఎంపీ రవికిషన్.."నా వ్యాఖ్యలకు జయా బచ్చన్ మద్దతు ఇస్తారని భావించా. ఎందుకంటే చిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని నేను చెప్పలేదు. కేవలం కొంతమంది మాత్రమే వారి చేష్టలతో ప్రపంచంలోని అతిపెద్ద చిత్రపరిశ్రమను అంతం చేయాలని అనుకుంటున్నారు. జయా బచ్చన్, నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిస్థితి ఇలా లేదు. కానీ, ఇప్పుడు మన చిత్రపరిశ్రమను రక్షించుకోవాలి" అని అన్నారు.
పార్లమెంటు వర్షకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన నియంత్రణ చర్యలతో ప్రారంభించిన ఈ సెషన్ అక్టోబరు 1న ముగుస్తుంది.