Puri Jagannadh: పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్‌గా పేరుపొందిన చిత్రం 'జనగణమన (జేజీఎం)'. దేశభక్తి నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'జేజీఎం' టైటిల్ ప్రకటించిన అనంతరం ఈ టీమ్ మొత్తం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆ విశేషాలివే..
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_3.jpg)
ఈ చిత్రానికి 'జేజీఎం' అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పగలరా?
పూరీ జగన్నాథ్: ఇది నా కలల ప్రాజెక్ట్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సినిమా తీయాలని ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ వల్ల నా కలల ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఒక ఫిక్షనల్ కథ. దేశభక్తి, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇందులో హీరో ఆర్మీ అధికారి. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఈ సినిమా ఉండనుంది. ఇందులో హీరో.. తన కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మిషన్ ప్రారంభిస్తాడు. ఆ మిషన్ పేరు 'జేజీఎం'. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు అదే పేరును టైటిల్‌గా ఫిక్స్ చేశాం.
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_8.jpg)
'జేజీఎం' ప్రొడెక్షన్ ఎలా ప్లాన్ చేశారు? సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండనుంది?
ఛార్మి: వచ్చే ఏడాది ఆగస్టు 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దీన్ని ప్రతిష్ఠాత్మక చిత్రంగా తెరకెక్కించాలనుకుంటున్నాం. 'లైగర్'లో విజయ్ దేవరకొండకు 'జేజీఎం'లో మీరు చూడబోయే విజయ్‌కు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
'జేజీఎం' కథ మిమ్మల్ని ఇంతగా ప్రభావితం చేయడానికి కారణమేంటి?
విజయ్ దేవరకొండ: మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ కథ విన్నప్పుడు తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమా చేసేందుకే నటుడ్ని అయ్యానని అనిపించింది.
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_4.jpg)
పూరీతో రెండోసారి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఒక్క మాటలో ఏమైనా చెప్పండి?
విజయ్ దేవరకొండ: పూరీ జగన్నాథ్.. ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్
'బుడ్డా హోగా తేరా బాప్' తర్వాత హిందీలోకి రావడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు?
పూరీ జగన్నాథ్: దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాలీవుడ్‌కి దూరంగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి హిందీలో సినిమా చేయాలని అనుకున్నా కానీ కుదరలేదు. 'లైగర్', 'జేజీఎం'.. మంచి కథలతో కమ్ బ్యాక్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_5.jpg)
అమితాబ్‌తో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నారా?
పూరీ జగన్నాథ్: తప్పకుండా చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు నేను పెద్ద అభిమానిని.
ఈ సినిమాలో మీరు ఏదైనా రోల్ చేస్తున్నారా?
ఛార్మి: నేను నటిని అనేది ఒక చరిత్ర. ఎందుకంటే సుమారు 6 ఆరేళ్ల క్రితం పూరీ సర్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ ప్రారంభించి నిర్మాతగా మారాను. ఈ బాధ్యతలను పూర్తిగా ఆస్వాదిస్తున్నా. నటనని పూర్తిగా మర్చిపోయాను.
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_7.jpg)
మీరు చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు కదా. ఆ ప్రాజెక్ట్ ఏమైంది?
పూరీ జగన్నాథ్: చిరంజీవికి కమర్షియల్ కథ చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. కాకపోతే, ఆయన ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడేలా మెసేజ్ ఓరియెంటెండ్ సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందుకే నా ప్రాజెక్ట్ చేజారిపోయింది.
విజయ్ దేవరకొండ: చిరు సర్‌తో ఓ సినిమాలో పూరీ నటించనున్నారు. (నవ్వులు)
మీ తదుపరి ప్రాజెక్ట్ కోలీవుడ్ నటుడు విజయ్‌తో చేస్తున్నారు కదా. అలాగే 'జేజీఎం' కోసం నిర్మాతగా మారి విజయ్ దేవరకొండతో వర్క్ చేయనున్నారు. మరి, ఇద్దరు విజయ్‌లతో పని చేయడం ఎలా ఉంది?
వంశీ: ఇద్దరు విజయ్‌లతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి పని చేస్తుంటే ఒక బ్రదర్‌తో చేస్తున్నట్టు ఉంది. తమిళ నటుడు విజయ్‌తో వర్క్ చేస్తుంటే సూపర్‌స్టార్‌తో చేస్తున్న ఫీల్ ఉంది.
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_1.jpg)
'లైగర్' టీజర్, ట్రైలర్‌లను త్వరలో విడుదల చేయనున్నారా?
ఛార్మి: 'లైగర్' పబ్లిసిటీ వర్క్ అంతా కరణ్ చూస్తున్నారు. మా సినిమా ఇప్పటికే అన్ని భాషల్లోనూ సిద్ధమైంది. కరణ్ చెప్పిన దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుని టీజర్, ట్రైలర్‌లను విడుదల చేస్తాం. తప్పకుండా ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తాం.
బాలీవుడ్ నటీనటులతో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది?
విజయ్ దేవరకొండ: బాలీవుడ్ వాళ్లతో కలిసి వర్క్ చేయడం ఎంతో సరదాగా ఉంది. నేను నటించిన 'అర్జున్ రెడ్డి', 'డియర్ కామ్రేడ్' చిత్రాలను కరణ్‌జోహార్ చూసి.. "నువ్వొక మంచి నటుడివి. నీతో కలిసి వర్క్ చేయాలని ఉంది" అని చెప్పారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత నాకు 'లైగర్' స్క్రిప్ట్ రావడం, అందులో కరణ్ కూడా భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక కరణ్ తప్పకుండా నాకు థ్యాంక్స్ చెబుతారు. ఎందుకంటే ఆయనకు 'లైగర్'తో మేం ఓ బ్లాక్‌బస్టర్ ఇవ్వనున్నాం.
![vijay devarakonda puri jagannadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14876615_6.png)
ఇదీ చూడండి: బయోపిక్‌లో ఆమిర్‌ఖాన్.. తమిళంలోకి మహేశ్ హీరోయిన్ ఎంట్రీ!