ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్ 2' చిత్రీకరణ పూర్తయ్యిందని ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పష్టం చేశారు. 'అవతార్' ఫ్రాంచైజీలోని మూడో చిత్ర షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యిందని తెలిపారు. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా వరల్డ్ సమ్మిట్-2020లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్తో జూమ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
"కరోనా వైరస్ ప్రపంచంలోని ప్రతి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అందరికంటే సినీ రంగాన్ని పెద్ద దెబ్బ కొట్టింది. దీనివల్ల మా చిత్ర విడుదలను మరో ఏడాది పాటు అంటే 2022కు వాయిదా వేశాం. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో అవతార్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 'అవతార్ 2' షూటింగ్ పూర్తవ్వగా.. 'అవతార్ 3' షూటింగ్ మరో 5 శాతం మిగిలి ఉంది."
- జేమ్స్ కామెరూన్, హాలీవుడ్ దర్శకుడు
ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌లో షెడ్యూల్ ప్రారంభించిన చిత్రబృందం.. కరోనా కారణంగా దాదాపుగా నాలున్నర నెలలుగా షూటింగ్‌ను ఆపేసింది. జూన్‌లో కరోనా లేని దేశంగా న్యూజిలాండ్ ప్రకటించిన తర్వాత 'అవతార్' చిత్ర యూనిట్ ప్రత్యేక అనుమతితో కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తూ చిత్రీకరణ పునఃప్రారంభించింది.