ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా నటించడం చాలా కష్టమని స్టార్ హీరో మోహన్‌లాల్ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం 'దృశ్యం2'. జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాను పోషించిన జార్జ్‌కుట్టి పాత్ర గురించి మోహన్‌లాల్ స్పందించారు.
"దృశ్యం 2' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా చేయాలి. ఇలా చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. అయితే మనం ఏదో చేస్తున్నట్లు మాత్రం కనిపించాలి. నటన అనేది ఒక నమ్మకం. కొన్నిసార్లు లోలోపల నిజమైన భావోద్వేగాన్ని పలికించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఎమోషన్స్ చూపించాల్సి ఉంటుంది. ఇలా చేయడం చాలా కష్టం."
- మోహన్‌లాల్, మలయాళ నటుడు
2013లో వచ్చిన 'దృశ్యం' ప్రేక్షకులను ఆకట్టుకుని కాసుల వర్షం కురిపించింది. ఆ చిత్రానికి కొనసాగింపే 'దృశ్యం2'. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: నాగార్జున