Chiranjeevi venky kudumula movie: తెలుగు చిత్రసీమలో ఊహకు అందని కలయికల్లో సినిమాలు కుదురుతున్నాయి. ఏమాత్రం ప్రచారంలో లేకుండా... అనూహ్యంగా వెలుగులోకి వస్తూ... ఆరంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి - వెంకీ కుడుముల, ప్రభాస్ - మారుతి, రామ్ - బోయపాటి శ్రీను, 'జనగణమన' కోసం రెండోసారి కలుస్తున్న విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలే అందుకు తార్కాణం.
కరోనా వల్ల రాబోయే రెండు మూడేళ్లకి సరిపడా సినిమాలన్నీ ముందే ఖరారైపోయాయి. ఆయా హీరోలు, దర్శకులు ఎప్పుడు ఎవరితో కలిసి సినిమాలు చేయనున్నారు? ఎవరి ప్రయాణం ఎలా ఉంటుందనే విషయాల్లో ఇటు ప్రేక్షకులకీ, అటు పరిశ్రమ వర్గాలకీ స్పష్టంగా తెలుసు. హీరోలంతా ముందస్తుగా నాలుగైదు కథల్ని పక్కా చేసి, ప్రకటించడమే అందుకు కారణం. అయినా సరే... వీటి మధ్యలో అనూహ్యంగా కొత్త కలయికలు పుట్టుకొస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అభిమానులకు లడ్డూ లాంటి నూతన తీపి కబుర్లు చెబుతున్నాయి.
మధ్యలో మరోటి..
Prabhas maruti movie: కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించే విషయంలో ప్రభాస్ ముందు వరసలో ఉన్నారు. ‘రాధేశ్యామ్’, ‘సలార్’ చిత్రాలు చేస్తున్న దశలోనే వరుసగా కొత్త సినిమాల్ని ప్రకటించారు. ‘ఆదిపురుష్’తోపాటు, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ సినిమాల్నీ పక్కా చేశారు. ప్రభాస్ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన వెలువడాలంటే ఒకట్రెండేళ్లయినా పడుతుందని ఊహించారంతా. అనూహ్యంగా మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. వీళ్ల కలయికలో సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే పేరు ప్రచారంలో ఉంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఇది శరవేగంగా పూర్తిచేసే ఆలోచనలో చిత్రవర్గాలు ఉన్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలిసి ‘లైగర్’ చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వెంటనే ఈ కలయికలో మరో సినిమా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ‘జనగణమన’ కోసం మరోసారి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ తదితర దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది. ఆయన పూరితో కలిసే మరోసారి రంగంలోకి దిగనున్నారు.
చిరు జోరు
Chiranjeevi venky kudumula movie: సీనియర్ హీరోల్లో చిరంజీవి జోరు కొనసాగుతోంది. ఆయనా వరుసగా నాలుగు సినిమాల్ని ప్రకటించారు. 'ఆచార్య', 'భోళాశంకర్', 'గాడ్‌ఫాదర్'తోపాటు బాబీతో చేస్తున్న సినిమా. ఇలా... ఒకొక్క ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటి తర్వాత చిరు చేయబోయే సినిమా ఏమిటనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఆయన కొత్త ప్రాజెక్టుల విషయంలో జోరు కొనసాగిస్తూ యువ దర్శకుడు, తన అభిమాని అయిన వెంకీ కుడుములతో సినిమాకి పచ్చజెండా ఊపేశారు. ఈ కలయికలో సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ‘అఖండ’తో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను - యువ కథానాయకుడు రామ్ పోతినేని కలయిక అలా ఆసక్తిని రేకెత్తించేదే. ప్రేక్షకుల్లో ముందుగానే అంచనాల్ని పెంచేదే! ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను... అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారనే ప్రచారం సాగింది. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం రంగంలోకి దిగుతుండడంతో ఆలోపు రామ్‌తో సినిమా కోసం రంగంలోకి దిగారు బోయపాటి. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన తనదైన శైలిలో... పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కథానాయకులు ముందస్తుగా ఎన్ని సినిమాలు పక్కా చేసుకున్నప్పటికీ... ఆయా పరిస్థితులకి తగ్గట్టుగా మధ్యలో మార్పులు చేర్పులు జరగడం, అనూహ్యంగా కొత్త ప్రాజెక్టులు సెట్ కావడం తరచూ జరిగేదే. అలా రానున్న కాలంలోనూ కొత్త కలయికల్లో చిత్రాలను ఊహించొచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ సినిమా ఫిక్స్