లాక్డౌన్ కారణంగా భారతీయులపై ఓటీటీల ప్రభావం ఎక్కువగా పడిందని ఓ సర్వే తెలిపింది. కరోనా విరామ సమయంలో ఎలాంటి సినిమా షూటింగ్లు జరగకపోవడం వల్ల సినీ అభిమానులంతా ఆన్లైన్ వేదికల బాట పట్టారని పేర్కొంది. యాప్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ మోమ్యాజిక్ చేపట్టిన సర్వేలో భారతీయులు అధికంగా ఓటీటీలకు ఆకర్షితులయ్యారని వెల్లడైంది.

"71 శాతం మంది ప్రేక్షకులు థియేటర్లోని టిక్కెట్ ధర కారణంగా ఓటీటీల బాట పట్టారు. మిగిలిన 27 శాతం మందికి ధరతో పెద్దగా పట్టింపు లేదు" అని తెలిపారు మోమ్యాజిక్ టెక్నాలజీస్ సీఈఓ, వ్యవస్థాపకుడు అరుణ్ గుప్తా.
థియేటర్ కంటే అదే బెటర్
ఇందులో 72 శాతం మంది సినిమా హాళ్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే పెద్ద తెర కలిగిన టెలివిజన్ను కొని దానికి హోమ్ థియేటర్ను అమర్చుకోవాలని భావిస్తున్నారట. అందువల్ల తమకు ఇష్టమైన సినిమాలు కుటుంబంతో సహా కలిసి చూడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సర్వే నివేదిక తెలిపింది.