క్రికెట్‌లో ఒకప్పుడు బాగా రాణించిన ఆటగాళ్లు... ఆటకు విరామం చెప్పి వెండితెరపై అదృష్టం పరీక్షించుకోవడం ఇప్పుడొక ట్రెండ్. ఇప్పటికే కేరళ పేసర్ శ్రీశాంత్ పలు సినిమాల్లో నటించగా... తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తన సినీ ప్రయాణాన్ని ఆరంభించాడు.
లుక్ అదుర్స్...
తమిళ సూపర్‌స్టార్ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్. తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. చిత్రీకరణ సమయంలో తీసుకున్న ఓ ఫొటోను కూడా నెట్టింట షేర్ చేశాడు ఇర్ఫాన్. 'డిమోంటే కాలనీ', 'ఇమ్మైకా నోడిగల్' సినిమాలను తెరకెక్కించిన అజయ్ ఙ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకా చిత్ర టైటిల్ ఖరారు చేయలేదు కానీ 'చియాన్విక్రమ్58' వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకొంటోంది.
ఇందులో ఓ టర్కీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ నటించబోతున్నాడట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్స్‌లో నటించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఒకే సినిమాలో అత్యధిక పాత్రలు పోషించిన నటుడిగా విక్రమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.
ఇర్ఫాన్ చివరిగా...
2003లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఇర్ఫాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 102 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1105 పరుగులు, 100 వికెట్లు; వన్డేల్లో 1544 పరుగులు, 173 వికెట్లు, టీ20ల్లో 172 పరుగులు, 80 వికెట్లు తీశాడు. టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా పఠాన్ రికార్డు సృష్టించాడు. 2006లో పాక్‌పై ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున ఆఖరిగా 2012లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ఆడాడు.
ప్రస్తుతం విక్రమ్ 'కదరం కొండన్' అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. రాజేశ్ ఎమ్.సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అక్షరా హాసన్ కథానాయిక. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.