'ప్రతిరోజూ పండగే', 'వెంకీమామ' చిత్రాలతో వరుస విజయాలు అందుకుని 'వరల్డ్ ఫేమస్ లవర్'తో యామిని లాంటి ఒద్దికైన ప్రియురాలిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది నటి రాశీఖన్నా. లాక్‌డౌన్ తర్వాత తమిళ సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల తెలుగింటి అమ్మాయిగా రెడీ అయ్యి ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె కొంటె చూపులకు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా రాశీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి సరదాగా ముచ్చటించింది.
మిస్ అవుతున్నా..
ప్రతి ఏడాది దీపావళి పండుగను మా కుటుంబంతో కలిసి సరదాగా జరుపుకునేదాన్ని. ఇంట్లో లక్ష్మీ, గణపతి పూజలు నిర్వహించేవాళ్లం. సాయంత్రం అమ్మ ఖీర్ సిద్ధం చేసేది. కజిన్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేదాన్ని. కానీ, ఈ ఏడాది షూటింగ్ కారణంగా చెన్నైలోనే ఉన్నాను. నా కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నా. షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంటికి వెళ్లడానికి అవకాశం ఉన్నప్పటికీ.. బయట ఉన్న పరిస్థితుల కారణంగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా లేను. మా తల్లిదండ్రుల్ని రిస్క్‌లో పెట్టడం నాకు ఇష్టం లేదు.
పండుగంతా సెట్‌లోనే..
ఈ ఏడాది సెట్‌లోనే దీపావళి జరుపుకోనున్నాను. చిత్రబృందమంతా కలిసి పూజ నిర్వహించి అనంతరం దీపాలు వెలిగించాలని నిర్ణయించుకున్నాం. అలాగే మాంచి సంప్రదాయ భోజనాన్ని సిద్ధం చేయనున్నాం. అమ్మవాళ్లకి వీడియో కాల్ చేసి మాట్లాడతాను.
ఎక్కువగా వద్దు..
చిన్నతనంలో కజిన్స్‌తో కలిసి టపాసులు ఎక్కువగా కాల్చేదాన్ని. కానీ, కొంచెం ఊహ తెలిశాక.. టపాసుల వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదమో అర్థమయ్యింది. అప్పటి నుంచి టపాసులకు దూరంగా ఉన్నాను. సంప్రదాయం కోసం కాకరపువ్వొత్తులు మాత్రమే కాలుస్తున్నాను.
వెలుగులు నిండాలి..
దీపావళి అంటే చీకట్లు పోయి వెలుగులు వస్తాయని అందరూ నమ్ముతారు. అలాగే ఈ ఏడాది దీపావళి తర్వాత కరోనా కారణంగా మనందరి జీవితాల్లో ముసురుకున్న చీకట్లు పోయి వెలుగులు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఏడాది పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను.
కొంచెం కంగారుపడ్డా..
కొవిడ్-19 నియమాలను అనుసరిస్తూ షూటింగ్‌లో పాల్గొనడం కొత్తగా ఉంది. లాక్‌డౌన్ సమయంలో అమ్మానాన్నను తప్పా వేరేవాళ్లని కలవలేదు. దీంతో షూటింగ్ కోసం చెన్నైకు వచ్చాక సెట్‌లో నా చుట్టూ 25 మందిని చూసి మొదట కొంచెం కంగారుగా అనిపించింది. కానీ, కెమెరా ముందుకు వెళ్లే సరికి నా భయాలన్నీ పోయాయి. వర్క్ చేయాలనే ఆసక్తి పెరిగిపోయింది.
అది నా కల..
పక్కా తెలుగమ్మాయిలా నటించాలనేది నా కల. ఒక నటిగా ప్రతిసారీ ప్రేక్షకులు నా నుంచి కొత్తదనం కోరుకుంటారు. నేను ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. నన్ను ఇంతకుముందు చూడని విధంగా వాళ్లకు కనిపించాలనుకున్నా అందుకే ఇటీవల తెలుగింటి అమ్మాయిలా రెడీ అయ్యి ఫొటోలు దిగాను. అలా అని నాకు గ్లామర్ పాత్రలు ఇష్టం లేదని కాదు. అవి కూడా నాకు ఇష్టమే. కానీ, ఒక నటిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఆశ. రానున్న సంవత్సరాల్లో మరిన్ని మంచి పాత్రలు చేస్తా.
ఫొటో చూసి ఆశ్యర్యపోయా..
ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నాను. స్పెషల్ పర్సన్ అంటూ నా జీవితంలో ఎవరూ లేరు. ఒకవేళ అలాంటి వ్యక్తే నా లైఫ్‌లోకి వస్తే అతనితో డేట్‌కు వెళ్తా. లాక్‌డౌన్ సమయంలో చాలామంది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రానా పెళ్లి ఫొటో చూసి ఆశ్చర్యపోయిన క్షణం ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. కాజల్, నితిన్ తమ సోల్‌మేట్స్‌ను పెళ్లి చేసుకొన్నారు. ఏదో ఒకరోజు నా జీవితంలోనూ అలాంటి అందమైన రోజు వస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతానికైతే తినడం, వర్కౌట్లు చేయడం, నిద్రపోవడం.. ఇదే నా జీవితం.