బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. దక్షిణాది కథానాయకులు అల్లు అర్జున్, విజయ్‌ల డ్యాన్స్‌ను మెచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ డ్యాన్స్ చేయడానికి ముందు ఏ సీక్రెట్ డైట్ పాటిస్తున్నారో తెలుసుకోవాలని ఉందని సరదాగా అన్నాడు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాల గురించి ముచ్చటించాడు.
'ఇటీవల కాలంలో విడుదలైన ఒక్క దక్షిణాది సినిమాను చూడలేకపోయా. కానీ, ఇక్కడి చిత్రాల్లో టెక్నాలజీని వాడే తీరుకు వీరాభిమానిని. ఇక్కడి నుంచే దాన్ని మేం నేర్చుకోవచ్చు. సాధారణంగా ఓ ప్రాజెక్టును ఎంచుకునేటప్పుడు.. ఒక్క ప్రశ్న లేకుండా ఒప్పుకునేలా ఉండాలి. కథ చాలా నచ్చితే 30 సెకన్లలో ఓకే చేస్తా. లేదంటే ఇక అందులో నటించననే అర్థం. ఇంతకు ముందు చాలా సినిమాల్ని ఇంత వ్యవధిలోనే అంగీకరించా. నా మనసు, శరీరం, ఆత్మ ఏం చెబుతుందో అదే చేస్తుంటా' -హృతిక్ రోషన్, బాలీవుడ్ హీరో
'డ్యాన్స్ చేయడానికి ఎంతో సాధన అవసరం. ఆపై ఫలితాన్ని వదిలేయాలి. ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేయాలి. నువ్వు నటుడివైతే ముఖంలో భావాల్ని పలికించాలి. ఎందుకంటే మనం డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తే ముఖంలో ఆ ఫీలింగ్స్ కనిపిస్తాయి.. అప్పుడు మూమెంట్స్ తప్పైనా సమస్యే ఉండదు' -హృతిక్ రోషన్, బాలీవుడ్ నటుడు
అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ప్రశ్నించగా.. 'ఎనర్జిటిక్, స్ఫూర్తిదాయకం, స్ట్రాంగ్' అని అన్నాడు హృతిక్. విజయ్ గురించి అడగ్గా.. 'నాకు తెలిసి వీరు రహస్యంగా ఏదో తింటున్నారు. ఎందుకంటే రోజూ అదే ఉత్సాహంతో ఉంటారే. డ్యాన్స్‌కు ముందు వీళ్లు ఏం తింటారో తెలుసుకోవాలని ఉంది' అని హృతిక్ అన్నాడు.
ఇదీ చదవండి: స్పెషల్: వెండితెర టైమ్ మిషన్స్ వచ్చేస్తున్నాయ్!