దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్కౌంటర్ ఆధారంగా ఆర్జీవీ సినిమా తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. సినిమా చిత్రీకరణ, విడుదలను ఆపాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కమిషన్ వద్ద విచారణ పెండింగ్‌లో ఉండగా.. సినిమా తీయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సినిమా తమ కుటుంబాన్ని మనోవేదనకు గురి చేసేలా కనిపిస్తోందని.. ట్రైలర్‌పై యూట్యూబ్‌లో ఉన్న కామెంట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు.
సెన్సార్ బోర్డును ఆశ్రయించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసి.. సినిమా చిత్రీకరణ, విడుదలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. సినిమా ప్రదర్శనపై సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోక ముందే న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రతివాదుల జాబితాలో సామాజిక మాధ్యమాలు లేవు కదా అని హైకోర్టు పేర్కొంది. అనుమతులు ఉన్నాయో లేవో తెలుసుకోవాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావును ఆదేశిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, రాంగోపాల్ వర్మను ఆదేశించింది.