కథానాయిక అమలాపాల్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె మాజీ ప్రియుడు భవిందర్ సింగ్ తన వ్యక్తిగత ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకుండా న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల అమలాపాల్ భవిందర్‌పై పరువునష్టం దావా వేసింది. దాన్ని పరిశీలించిన కోర్టు.. వివరణ ఇవ్వాలని భవిందర్‌ను ఆదేశించింది. కేసును డిసెంబరు 22కు వాయిదా వేసింది.
భవిందర్ తమ వ్యక్తిగత చిత్రాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, వివాహం జరిగినట్లు చిత్రీకరిస్తున్నాడంటూ ఇటీవల అమలాపాల్ కోర్టును ఆశ్రయించింది. ఈ నటి రెండో పెళ్లి చేసుకుందని మార్చిలో వార్తలు హల్‌చల్ చేశాయి. ముంబయికి చెందిన గాయకుడు భవిందర్‌తో ఆమె పెళ్లి జరిగిందంటూ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటిపై అమలాపాల్ స్పందిస్తూ.. వృత్తిపరమైన అవసరాల కోసం ఆ ఫొటోలు దిగామని, అది పెళ్లి కాదని స్పష్టం చేసింది.
2014లో అమలాపాల్ తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల 2017లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2019 జులైలో విజయ్ రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత ఓ వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని అమలాపాల్ చెప్పింది. కానీ ఆయన ఎవరో వెల్లడించలేదు. ఇదే సమయంలో ముంబయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. కొన్ని కారణాల వల్ల ఆమె, భవిందర్‌తో విడిపోయినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.