నచ్చిన హీరో సినిమా వస్తుంటే ఏదోతెలియని సంతోషం... ఇష్టమైన హీరోయిన్ ఫొటో గదిలో గోడకు వేలాడుతుంటే ఆనందం... ఇలాంటి సెలబ్రిటీ క్రష్‌లు అందరికీ ఉండేవే. కొన్నేళ్లపాటు ఆ వ్యక్తిని ఆరాధిస్తూ గడిపేసే ఆ క్రేజీ ఫీలింగ్ మనకే కాదండోయ్... తమ అందం, అభినయంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న కథానాయికలకూ ఉంటుంది. వాళ్లంటే ఎంతమంది ఇష్టపడినా, వాళ్లకు మాత్రం ఆ ఒక్కరంటేనే అభిమానమట. మరి అదెవరో చూద్దామా!
విజయ్ అంటే ప్రాణం!
తెలుగులోనే కాదు... దక్షిణాది భాషల్లో రష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్, ఎంతోమంది కుర్రాళ్ల కలలరాణి. కానీ తనకు తెలిసీతెలియని వయసు నుంచీ ఇష్టపడింది మాత్రం ఇళయదళపతి విజయ్‌నే తెలుసా! ఆమె టీనేజ్‌లో విజయ్ సినిమాలు చూసినవే మళ్లీ మళ్లీ చూసేది. అతనంటే విపరీతమైన అభిమానం. ఇప్పటికీ ఏ ఇంటర్వ్యూలో అడిగినా విజయ్ తన ఫేవరెట్ హీరోనే కాదు, ఆల్‌టైం క్రష్ అంటుంది రష్మిక.
రణ్వీర్ మాయ చేస్తాడు!
ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టేస్తుంది రకుల్‌ప్రీత్ సింగ్. తన వర్క్ఔట్ చూసి సిక్స్‌ప్యాక్ హీరోలు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఈ అమ్మాయికి బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ అంటే చాలా ఇష్టమట. తనను చూస్తేనే ఏదో మాయ కమ్మినట్టు ఉంటుంది అంటోంది రకుల్. ఓసారి అనుకోకుండా కలిసినప్పుడు 'మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా' అని చెప్పేసింది కూడా. దానికి రణ్వీర్... 'తెలుసు, ఓ ఇంటర్వ్యూలో చెప్తుంటే చూశాను' అని నవ్వేశాడు. అతడి నటనకు ఎన్ని మార్కులైనా వేసేయొచ్చని మెచ్చేసు కుంటోంది రకుల్.
అర్జున్‌రెడ్డి చూశాక...
ఆర్ఎక్స్100 సినిమాలో తన నటన, అందంతో కుర్రకారు మతి పోగొట్టింది పాయల్ రాజ్‌పుత్. ఈమధ్య కాలంలో ఒక నెగిటివ్ రోల్‌తో అంతగా పేరు తెచ్చుకోవడం బహుశా తనకే చెల్లిందేమో. తను నార్త్ అమ్మాయే అయినా... అక్కడ ఎంతమంది హీరోలున్నా... విజయ్ దేవరకొండ అంటేనే క్రష్ ఉందట ఈమెకు. అర్జున్‌రెడ్డి సినిమా చూసినప్పటి నుంచీ విజయ్‌కు ఫ్యాన్ అయిపోవడమే కాదు... ఎక్కడలేని ఇష్టమూ పెంచేసుకుందట!
షారుఖ్ పేరు చెబితే...
ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్‌కు బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది మనసు దోచుకున్న నభాకు మాత్రం షారుఖ్‌ఖాన్ ఆల్‌టైం క్రష్ అట. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఆయన సినిమాలు బాగా చూసేది. 'కుచ్ కుచ్ హోతాహై' అయితే ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదట. షారుఖ్ లాంటి బాయ్‌ఫ్రెండ్ దొరకాలని కాలేజీ రోజుల్లో తెగ కోరుకునేదట. షారుఖ్ మంచి నటుడే కాదు, పర్ఫెక్ట్ భర్త కూడా అంటోందీ భామ.
కండల వీరుడే కలల రాకుమారుడు
లేలేత అందాల కియారా అద్వాణీ బయటకు సైలెంట్‌గా కనిపిస్తుంది కానీ నిజానికి చాలా అల్లరిపిల్లట. కాలేజీ రోజుల్లో క్లాసులు ఎగ్గొట్టి మరీ హృతిక్ రోషన్ సినిమాలు చూసేది. 'కహో నా ప్యార్ హై' సినిమా చూసిన తర్వాత కొన్నేళ్లపాటు హృతిక్ అంటే పడిచచ్చేంత ఇష్టమట తనకు. ఇప్పటికీ హృతిక్ నాకు చాలా స్పెషల్ అని చెబుతూనే రణ్‌వీర్‌సింగ్ కూడా నచ్చుతాడు అని అంటోంది.
ఇదీ చూడండి : పొరుగు చిలుకలు... తెలుగు పలుకులు