Nagarjuna: ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. మా అందరి కోసమే చిరంజీవి.. జగన్‌తో సమావేశం అయ్యారని చెప్పారు. సినిమా విడుదల ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని వెల్లడించారు. జగన్‌తో సమావేశం ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారని పేర్కొన్నారు. చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదని స్పష్టం చేశారు. సీఎంతో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అంతా మంచే జరుగుతుంది..
‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నేనూ చిరంజీవిగారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. వారం రోజుల కిందట నాకు ఫోన్ చేసి ‘సీఎం జగన్‌ను కలవబోతున్నా’ అని చెప్పారు. నన్ను కూడా అడిగారు. కానీ, ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో రావటం కుదరదని చెప్పా. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతా మంచే జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయని, ప్రభుత్వాలు కూడా రోజుకో కొత్త నిబంధన విధిస్తున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు." -నాగార్జున, ప్రముఖ నటుడు
టికెట్ రేట్ల గురించి నాగార్జున స్పందన
‘‘గతేడాది ఏప్రిల్‌లో జీవో నెం.35 విడుదల చేశారు. ఒక సినిమా హిట్ అయితే ఇంత కలెక్ట్ చేస్తుందా? లేదా? అని లెక్కలు వేసుకున్నాం. వరుసగా సినిమాలు తీస్తుంటాం. ఎక్కువ బడ్జెట్ వేసి చెప్పేది లేదు. అలాగని తక్కువా చెప్పం. ‘బంగార్రాజు’ సినిమా వరకూ ఆ టికెట్ రేట్లు వర్కవుట్ అవుతాయని అనిపించింది. మరొక సినిమాకు కాకపోవచ్చు. రేట్లు పెరిగితే మాకు బోనస్ వచ్చినట్లే. సినిమా ఆడకపోతే చేసేదేమీ లేదు. దాని కోసం సినిమా రిలీజ్ చేయకుండా ఉండలేను. రెండేళ్ల పాటు సినిమా లేకుండా ఇంట్లో కూర్చొన్నా. బిగ్‌బాస్ ఉంది కాబట్టి, నాకు ఇన్నాళ్లూ ఎంటర్‌టైనింగ్ అయింది." -నాగార్జున, ప్రముఖ నటుడు
ఏపీలో సినిమా టికెట్ల వివాదం తారాస్థాయికి చేరింది. గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చులోనే పేదలకు వినోదం అందాలన్నది ప్రభుత్వ వైఖరి అని మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్‌ను కలవటంపై అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
ఇదీ చదవండి: