రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషనల్ సాంగ్ ఒక అద్భుతమని గాయకుడు హేమచంద్ర అన్నారు. జక్కన్న టీమ్‌లో ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను ఆలపించిన హేమచంద్ర తన అనుభవాలను పంచుకున్నారు.
"రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. ఇదంతా ఒక కలలా ఉంది. పాట పాడటం ఒకెత్తయితే, సాంగ్ షూట్ అంతా మరోస్థాయిలో జరిగింది. ప్రతిపాటకూ సరిగా పాడతామా? లేదా? అని గాయకుడిపై కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ పాట విషయానికి వస్తే.. 'ఆర్‌ఆర్‌ఆర్' అతి పెద్ద సినిమా. పైగా పాన్ ఇండియా చిత్రం. అలాంటి ప్రాజెక్టులో ఫ్రెండ్‌షిప్ పాట పాడటం అంటే నేను సరిగా పాడగలనా? లేదా అని భయం వేసింది. ఆ పాటను తెరకెక్కించిన విధానం ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. లిరిక్స్ గురించి చెప్పాలంటే. సీతారామశాస్త్రిగారు రాశారు. ప్రతి లైన్ అద్భుతమే" అని హేమచంద్ర అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి కీరవాణి రాజమౌళితో కలిసి పనిచేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా తమిళ యువ సంచలనం అనిరుధ్ జక్కన్న టీమ్‌లో కలిసి పనిచేశారు. ఇటీవల ఆ విషయాన్ని కీరవాణి స్వయంగా వెల్లడించారు. 'దోస్తీ' పేరుతో సాంగ్ ఆగస్టు 1న ఉదయం 11గంటలకు విడుదల కానుంది.