RRR movie: 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ ఓనర్లుకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పాన్ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' టికెట్ ధరలను అదనంగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం సినిమా... విడుదలైన మొదటి పది రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రతి కేటగిరిలోని ఒక్కో టికెట్‌పై రూ.75 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ.100 కోట్లు బడ్జెట్ దాటితే.. విడుదలైన 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశాన్ని జీవో నం.13లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వమని ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
‘ఆర్‌ఆర్‌ఆర్’ సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదీ చూడండి: