సినిమాల విడుదల తేదీల్ని ముందే ప్రకటించి రంగంలోకి దిగుతున్న కాలమిది. వేసవి కోసం కొంతమంది, దసరా లక్ష్యంగా ఇంకొంతమంది, ఈ ఏడాదిలోపు మన సినిమా రావాల్సిందే అని మరికొంతమంది. ఇలా ఎవరికివాళ్లు కీలకమైన సీజన్లను లక్ష్యంగా చేసుకుని చిత్రీకరణల్ని ప్రారంభించారు. రామోజీ ఫిలింసిటీ నుంచి... జార్జియా వరకు ప్రపంచం నలుమూలలా తెలుగు సినిమాల క్లాప్‌బోర్డు చప్పుళ్లు వినిపించేవి. పరిశ్రమ కళకళలాడేది.
ఇంతలోనే కరోనా పంజా విసరడం వల్ల ప్రణాళికలు తలకిందులయ్యాయి. సినిమాల విడుదలలే కాదు, చిత్రీకరణలూ రద్దయ్యాయి. తారలు కొన్నాళ్లపాటు ఇంటికే కాల్షీట్లు అంకితం చేయాల్సిన పరిస్థితి. ఫలితంగా విడుదల తేదీలపైనా ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆదివారం నుంచి తెలంగాణలో థియేటర్లను మూసివేయడం వల్ల చిత్రాల విడుదలలన్నీ ఆగిపోయాయి. ప్రచార కార్యక్రమాల్ని ఆపేశారు నిర్మాతలు. ఈ నెల 21 వరకే థియేటర్ల మూత అని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. పరిస్థితులు అనుకూలిస్తే యథావిధిగా ఉగాదికి సినిమాలు విడుదల చేసుకోవచ్చనే ఆశతో కొందరు నిర్మాతలు కనిపిస్తున్నారు.
అదే జరిగితే వేసవి సీజన్‌కు సమస్య లేనట్టే. అయితే... చిత్రీకరణలకు మాత్రం బాగా అంతరాయం కలిగింది. విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ చేయాల్సిన షూటింగ్‌లను మానుకున్న సినీ బృందాలు చాలానే. సోమవారం నుంచి స్థానికంగా చిత్రీకరణలకు దూరంగా ఉండాలని తారలు నిర్ణయించారు. చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకోకముందే అగ్రతారలు స్వచ్ఛందంగా తమ సినిమాల చిత్రీకరణల్ని రద్దు చేసుకున్నారు.
ఎవరెవరి సినిమా ఎలా?
కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా రోజుల నుంచే సినిమాల చిత్రీకరణలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. మన అగ్రతారల సినిమాలూ అందుకు మినహాయింపు కాదు. చిరంజీవి, శనివారం రాత్రే తన 'ఆచార్య' సినిమా చిత్రీకరణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేశారు. ఈ నెల 23 నుంచి కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టాలనుకున్నారు. కానీ కరోనా వల్ల వచ్చే నెలలోనే కొత్త షెడ్యూల్‌ను ఆరంభించాలని నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని వారణాసిలో తీయాల్సి ఉంది.
అల్లుఅర్జున్ కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. అతడు హీరోగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను కేరళలో మొదలు పెట్టాలనుకున్నారు. కరోనా వల్ల అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నెల 13న కేరళ వెళ్లాల్సిన చిత్రబృందం ఆగిపోయింది. కానీ ఎక్కువ రోజులు ఆపితే సమస్యలొస్తాయని భావించిన చిత్రబృందం, తర్వాత తీయాలనుకున్న సన్నివేశాల్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెల 20 నుంచి రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో తెరకెక్కించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. తాజాగా మన దగ్గర కరోనా కలవరం మొదలు కావడం వల్ల ఇప్పుడా షూటింగ్‌ను ఆపేయాలని నిర్ణయించారు.
పుణెలో చిత్రీకరణ కోసం
వచ్చే సంక్రాంతికి విడుదల తేదీని ఖరారు చేసుకుంది రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్'. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రమిది. బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్ తారగణం అందులో నటిస్తోంది. కీలకమైన సన్నివేశాల్ని పుణెలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. ఆలియా భట్‌తోపాటు విదేశీ నటులు పాల్గొనే సన్నివేశాల్ని తెరకెక్కించాలని ప్రణాళికలు రచించినట్టు సమాచారం. కానీ ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా భయంతో పుణె వెళ్లడంపైనే చిత్రబృందం మల్లగుల్లాలు పడుతోంది.
నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'వైల్డ్‌డాగ్' కరోనా వైరస్ ప్రభావంతో ఓ విదేశీ షెడ్యూల్‌ను ఇప్పటికే వాయిదా వేసింది. కొన్నాళ్లుగా ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. శరవేగంగా పూర్తవుతున్న ఆ సినిమాపై తాజాగా కరోనా దెబ్బ పడింది. నాగార్జున వచ్చే నెల 1వరకు చిత్రీకరణను ఆపేయాలని నిర్ణయించాడు. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చిత్రవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఔట్‌డోర్ వెళ్లిపోయిన కొన్ని చిత్రబృందాలు అక్కడ పలు జాగ్రత్తలతో చిత్రీకరణలు చేసుకుంటున్నాయి. వెంకటేశ్ 'నారప్ప' తమిళనాడులో, ప్రభాస్ సినిమా చిత్రీకరణ జార్జియాలో జరుపుకుంటున్నాయి.
నష్టమే కానీ... తప్పదు
"అగ్ర తారలు, సాంకేతిక నిపుణులు పనిచేసే సినిమాల చిత్రీకరణలు వాయిదా పడితే నష్టం మరింత ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. సెట్లు వేస్తాం, లొకేషన్లు అద్దెకు తీసుకుంటాం. ప్రయాణాలతో పాటు చిత్రబృందం బస చేయడానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటాం. ఉన్నట్టుండి చిత్రీకరణలు ఆగిపోతే అవన్నీ నష్టపోవల్సి వస్తుంది. నటీనటుల డేట్స్ విషయంలోనూ సమస్యలొస్తాయి. మేం అల్లుఅర్జున్ సినిమాను కేరళలో తీయాలని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంతలోనే చిత్రీకరణ రద్దయింది. అయినా సరే... ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పదు. ఈ నెల 21 వరకే థియేటర్ల మూత అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడితే మా 'ఉప్పెన' అనుకున్న సమయానికే విడుదల కావొచ్చు".
- యలమంచిలి రవిశంకర్, నిర్మాత (మైత్రీ మూవీ మేకర్స్)
ఇదీ చూడండి.. ఆ బాలీవుడ్ భామలు ప్రయాణించే లగ్జరీ కార్లు ఏంటంటే?