DJ Tillu Actress: "తొందర పడి ఏది పడితే అది చేసేయాలని నేనేమీ అనుకోవట్లేదు. కాస్త ఆలస్యమైనా మంచి చిత్రాలే చేయాలనుకుంటున్నా" అంది నటి నేహా శెట్టి. 'మెహబూబా', 'గల్లీ రౌడీ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ కస్తూరి ఆమె. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా 'డిజె టిల్లు'లో నటించింది. విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది నేహా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
కాస్త భయపడ్డా
"రాధిక పాత్ర కోసం నేనెలాంటి రిఫరెన్స్‌లు తీసుకోలేదు. సహజంగా నాకు అనిపించినట్లు చేసుకు వెళ్లిపోయాను. ఈ విషయంలో దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నిజానికి ఈ పాత్ర చేసేటప్పుడు కాస్త భయపడ్డాను. నేను అనుకున్నట్లు చేస్తే.. ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో? అనుకున్నా. ఆ పాత్రలో నేను నటించిన విధానం నాకు చాలా నచ్చింది. ట్రైలర్ విడుదలయ్యాక అందరూ నన్ను రాధిక ఆప్టే అని పిలుస్తున్నారు. సిద్ధు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమా ద్వారా తనతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా ఫీలవుతున్నా. సెట్లో సిద్ధుతో కలిసి నటిస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయేదాన్ని".
"చిన్నప్పటి నుంచే నటి అవ్వాలన్న కోరిక నాకు బలంగా ఉండేది. ఆ ఇష్టంతోనే కాలేజీ చదువు పూర్తి కాగానే మోడలింగ్ చేశాను. 'ముంగారమళై 2' అనే మలయాళ చిత్రంతో నటిగా వెండి తెరకు పరిచయమయ్యాను. తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చింది. అలా ఆయన తెరకెక్కించిన 'మెహబూబా' సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాను. తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి.. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నా. వచ్చాక 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాల్లో నటించా. కరోనా పరిస్థితుల కారణంగా ఇవన్నీ కాస్త ఆలస్యమవడం వల్ల నాకు గ్యాప్ వచ్చినట్లయింది".
నవ్వి నవ్వి.. కన్నీళ్లొచ్చాయి
"'డిజె టిల్లు' ట్రైలర్ చూసి అందరూ ఇది రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటున్నారు. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులు నిండిన ఒక ప్యాకేజ్ లాంటి సినిమా. నేనీ కథ విన్నప్పుడే బాగా నవ్వుకున్నాను. నవ్వి నవ్వి.. కన్నీళ్లు వచ్చేశాయి. తెలంగాణ యాసపై నాకు అంతగా అవగాహన లేదు. కానీ, స్క్రిప్ట్‌లో ఆ యాసలో సంభాషణలు వింటున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇందులో కామెడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా చూస్తే.. నవ్వులతో పాండమిక్ ఒత్తిడినంతా మర్చిపోతారు".
హృతిక్ స్ఫూర్తితో..
"నేను మంగుళూరులో పుట్టి బెంగళూరులో పెరిగాను. హృతిక్ రోషన్ తొలి చిత్రం విడుదలైనప్పుడు నాకు రెండేళ్లు. ఆయన డ్యాన్స్ నన్ను బాగా ఆకట్టుకుంది. అలా నాకూ మెల్లగా నటన పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్‌లో, కాలేజీలో ప్రతిఒక్కరికీ తెలుసు.. నేను కచ్చితంగా నటిని అవుతానని. తొలి సినిమా విడుదలైనప్పుడు మా కాలేజీ వాళ్లంతా సెలవు పెట్టి మరీ సినిమా చూశారు. మేము నటులం. తెరపై ఏమి చేసినా అది నటన మాత్రమే. ప్రస్తుతం నా దృష్టంతా 'డిజె టిల్లు'పైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక.. నా తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడతాను".
నాది రాధిక పాత్ర
"ఈ చిత్రంలో నా పాత్ర పేరు రాధిక. ఈతరం అమ్మాయిలకు ప్రతిబింబంలా కనిపిస్తుంది. నిజాయితీగా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. తనకు కరెక్ట్ అనిపించిన పనే చేస్తుంది. ఎవరేం అనుకుంటారు అనేదాని గురించి అసలు ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల విషయంలో తనకి పూర్తి స్పష్టత ఉంటుంది. ఈ లక్షణాలన్నీ నాకెంతో నచ్చాయి. అందుకే రాధిక పాత్రను త్వరగా అర్థం చేసుకుని.. ఆ పాత్రలా మారిపోగలిగాను. ట్రైలర్‌లో రాధిక హీరోను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు చూపించారు. కానీ, తనెందుకు అలా చేసింది? దాని వెనకున్న కారణమేంటి? అన్నది సినిమా చూశాక ప్రేక్షకులకు తెలుస్తుంది".
ఇదీ చూడండి: పవన్, రవితేజతో సినిమాలు.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?