అక్షరాలను మాటలుగా మార్చి.. మనసులు దోచుకొనే విద్య త్రివిక్రమ్‌కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో! ఆ విద్య ఆయనకు ఊరికే రాలేదు. ఎన్నో వేల పుస్తకాల అధ్యయనం, ఎన్నో అనుభవాల సారమది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మాటల మాంత్రికుడితో ముఖాముఖి.
ఎప్పుడూ ఏదో ఓ పుస్తకం చదువుతుంటారు కదా. ఈసారి తిరగేస్తున్న పుస్తకం ఏమిటి?
పతంజలి రచనలు చదువుతున్నా. ఇది వరకు చదివేసిన పుస్తకాల్ని మరోసారి తిరగేయడం ఇంకా ఇష్టం. ఈమధ్య యువతరం చేతుల్లో పుస్తకాలెక్కువగా కనిపిస్తున్నాయి. వారికీ పుస్తకాల విలువ మెల్లగా అర్థం అవుతోంది. 'హ్యారీ పోర్టర్' పుస్తకాల్ని క్యూలో నిలబడి మరీ కొనుక్కుని చదివారు కదా. తెలుగు పుస్తకాలు ఇక అలా చదివే రోజులొస్తాయి.
సినిమా డైలాగుల్లో ఓ మంచి విషయం చెప్పొచ్చని ఎవరిని చూసినప్పుడు అనిపించింది?
ఆత్రేయ మామూలు సన్నివేశంలోనూ గొప్ప విషయాలు చెబుతారు. అవేం బలవంతంగా రుద్దినట్టు అనిపించదు. ఆ కష్టం నాకు రచయిత అయ్యాకే తెలిసింది. చాలా ఇబ్బందికర విషయాల్ని ఆయన చాలా అందంగా చెప్పారు. జంధ్యాల క్యారెక్టరైజేషన్స్ బాగా పట్టుకుంటారు. మధ్యతరగతిలోని కోపాన్ని వినోదంగా మార్చారు. దాన్ని సెటైర్‌గా మార్చినవారు ముళ్లపూడి. ఈ ముగ్గురికీ పరిస్థితులపై విపరీతమైన కోపం. కాబట్టే హాస్యం రాయగలిగారు. నా వరకూ ఈ ముగ్గురూ ముగ్గురే.
'అల.. వైకుంఠపురములో' కథకు బీజం ఎక్కడిది?
"ఎవరికైనా స్థానం ఇవ్వగలమేమో గానీ, స్థాయిని ఇవ్వలేం" అనే పాయింట్‌ని ఈ కథతో చెప్పాలనిపించింది. సంపద వేరు, ఐశ్వర్యం వేరు. డబ్బున్న ఇల్లు చూడండి. విశాలంగా ఉన్నా, అక్కడ కాసేపు కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. అదే మధ్యతరగతి ఇంట్లోకి వెళ్లండి. ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది. హాలులో ఉన్న ఒకే ఒక్క దివాన్‌పై కూర్చుంటే.. రేడియోలోంచి మంచి పాట వినిపిస్తుంటుంది. కిటికీని అల్లుకున్న మల్లెపందిరి నుంచి చక్కటి సువాసన వస్తుంటుంది. వంటింట్లో వేగుతున్న బంగాళాదుంపల వేపుడు ఆకలిని పెంచేస్తుంటుంది. ఓ టీ తాగి వెళ్లిపోదామనుకుంటే... భోజనమూ వడ్డిస్తారు. గొప్పింట్లో సంపద ఉంది. ఇక్కడ ఐశ్వర్యం ఉంది. అదే తేడా. దాన్ని సరదాగా ఎలా చెప్పాలో ఆలోచించి ఈ కథ రాసుకున్నా.
సామజవరగమన.. పాట తెరకెక్కించడానికి ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. నిజమేనా?
ఖర్చు గురించి నిర్మాతే చెబుతారు. నాకు సంబంధం లేని విషయం అది. (నవ్వుతూ). 'అరవింద..'లో ‘పెనిమిటీ’ పాట చాలా పెద్ద హిట్. కానీ దానిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. "మరోలా తెరకెక్కించాల్సింది" అన్నారు. మంచి పాటలెప్పుడో అరుదుగా వస్తాయి. అలాంటప్పుడు ఆ స్థాయిని చిత్రీకరణతో తగ్గించకూడదు. అందుకే ‘సామజవరగమన’ ఒళ్లు దగ్గర పెట్టుకుని తెరకెక్కించాం. పాటలంటే ఈమధ్య హీరో, హీరోయిన్లు డాన్సులపై దృష్టి పెడుతున్నారు. లిప్ సింక్ కూడా మర్చిపోతున్నారు. అప్పట్లో అలా కాదు. గుండెలోతుల్లోంచి పాడేవారు. ఈ పాట విషయంలో పాత రోజుల్ని గుర్తు చేశాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరి కథ వాళ్లే చెప్పాలి
ఈతరంలోని ఏ కథానాయకుడూ "సినిమా కంటే మనం పెద్దవాళ్లం' అని అనుకోవడం లేదు. కొన్నాళ్లు అది నడిచింది. కానీ ఇప్పుడు కాదు. 1970ల వరకూ భారతీయ చలన చిత్రసీమ కథలే చెప్పింది. ఆ తరవాత ఇంకేదో వెదికే పనిలో దారి తప్పాం. కథలు మానేసి ఐటెమ్‌ల వైపు ఆలోచించాం. ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చాం. ఇది అలాంటి సమయమే. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌తో ప్రపంచ సినిమా అంతా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరి కథలు వాళ్లే చెప్పాలి. కాకపోతే బలంగా చెప్పాలి.
అర్థం చేసుకొని మాట్లాడాలి
అప్రియమైన సత్యం చెప్పొద్దు అంటారు. ఉపయోగం లేని నిజాలు అనవసరం. "నేను మందు మానేశాను" అని ఓ మహానుభావుడు చెబితే, అది చాలా మందికి స్ఫూర్తి ఇస్తుంది. "నేను ఫలానా బ్రాండు తాగుతా" అంటే.. ఆ ఫలానా బ్రాండు అమ్మకాలకే ఆ మాట పనికొస్తుంది. దాని వల్ల యువత మరింత చెడిపోతుంది. అయితే హిపోక్రసీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. మంచి, చెడు.. తప్పు, ఒప్పు అనేది కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పటి తప్పు. రేపు ఒప్పు కావొచ్చు ఇప్పటి ఒప్పు.. రేపటికి తప్పు అనిపించొచ్చు దాన్ని అర్థం చేసుకుని మాట్లాడగలగాలి.
ప్రశాంతంగానే...
సంక్రాంతికి వచ్చే సినిమాలను జనం పోటీగా తీసుకోరు. వచ్చేవి సినిమాలు.. కోళ్లు కావు కదా. పోటీలు పడడానికి. సినిమాల మధ్య యుద్ధ వాతావరణం ఏమీ లేదు. అంతా ప్రశాంతంగానే ఉంది.
ఇవీ చూడండి.. సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్న కియారా..?