భవిష్యత్ అంతా ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్ ఫాంలదే అని నిన్నమొన్నటి వరకు మాటలు వినిపిస్తే కొందరు కొట్టిపారేసే వాళ్లు. కానీ, కరోనా దెబ్బకు ఈ మాటే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల చిత్ర పరిశ్రమ పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు ముస్తాబైన చిత్రాలు కూడా నిర్మాణ నష్టాలను తగ్గించుకోవడానికి ఓటీటీల బాట పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాన్ని లక్ష్యంగా చేసుకునే మరిన్ని సినిమాలు రూపొందే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అందుకే దీనికి తగ్గట్లుగానే పలువురు అగ్ర దర్శకులు కూడా ఇప్పటి నుంచే వెబ్ సిరీస్‌ల వైపు దృష్టిసారిస్తున్నారు. పేరొందిన డిజిటల్ ప్లాట్‌ఫాంలతో వెబ్‌సిరీస్‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్ వర్మ, సంకల్ప్ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్ సిరీస్ చిత్రీకరణల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలో తేజ కూడా చేరిపోయినట్లు సమాచారం. త్వరలో హాట్ స్టార్ కోసం వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్న అమెజాన్‌తో కలిసి తేజ ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం గోపిచంద్ హీరోగా 'అలిమేలుమంగ వెంకట రమణ', రానా హీరోగా 'రాక్షస రాజు రావణాసురుడు' సినిమాలు తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు తేజ.
ఇదీ చూడండి : 'పోకిరి' గురించి ఈ విషయాలు మీకు తెలుసా?