టాలీవుడ్ దర్శకుడు తేజ.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడంలో వేగం తగ్గించేశాడు. 2017లో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ కొట్టినా, గతేడాది 'సీత'తో ఫ్లాఫ్ అందుకున్నాడు. ఆ తర్వాత పలువురు హీరోలతో సినిమాలు చేయనున్నాడనే వార్తలొచ్చినా, అవేవి ఖరారు కాలేదు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా రెండు కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించాడు. వాటికి అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టాడు. ఇంతకు ముందు తనతో కలిసి పనిచేసిన రానా, గోపీచంద్లతోనే వీటిని తెరకెక్కించనున్నాడు.
ఈ సినిమాలకు 'అలివేలుమంగ వేంకటరమణ', 'రాక్షసరాజు రావణాసురుడు' అనే టైటిల్స్ పెడుతున్నట్లు వెల్లడించాడు. అయితే తొలి సినిమాలో గోపీచంద్, రెండోదానిలో రానా హీరోలుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల్లో ముందుగా మొదలయ్యేది గోపీచంద్ చిత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్'లో నటిస్తున్నాడు గోపీ. పూర్తయిన వెంటనే తేజతో పనిచేయనున్నాడు.