Ram Gopal Varma Twitter: ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలనుకోవటం మూర్ఖత్వమని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ టైటిల్ ఉన్నంత మాత్రాన ఎవరూ మాట వినరన్నారు. ఆర్జీవీని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలనేది తన కోరికని 'ఆర్‌ఎక్స్ 100', 'మహా సముద్రం' చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల ఓ ట్వీట్ పెట్టారు. ఈ విషయంపై ఆర్జీవీ ఇటీవలే స్పందించారు.
"అజయ్ గారూ.. ఇండస్ట్రీ వారికి పెద్ద దిక్కుగా ఉండాలనుకోవటం మూర్ఖత్వం. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తికీ స్వార్థం ఉంటుంది. ఆ కారణంగా తమకు పనికొచ్చే మాటే వింటారు కానీ ఎవరికో పెద్ద దిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి చెప్పే మాట ఎవ్వరూ వినరు" అని ట్వీట్ చేశారు.
సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే "మా బాస్‌ని (రామ్‌గోపాల్ వర్మ) ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనేది నా కోరిక. సామీ మీరు రావాలి" అంటూ అజయ్ భూపతి ట్వీట్ చేశారు.
ఆర్జీవీకి నాగబాబు మద్దతు..
మరోవైపు, నటుడు, నిర్మాత నాగబాబు.. ఆర్జీవీకి మద్దతుగా నిలిచారు. 'సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి నా పది ప్రశ్నలు' అంటూ ఆర్జీవీ విడుదల చేసిన వీడియోను నాగబాబు రీట్వీట్ చేశారు. "మీరు చెప్పింది నిజం. నేనేం అనుకుంటున్నానో మీరూ అదే అడిగారు" అని ఆర్జీవీకి తెలిపారు.
ఇదీ చూడండి: 'టికెట్ రేట్ల లాజిక్ ఏంటో ఏపీ ప్రభుత్వం మాకూ చెప్పాలి'