"కొత్త కథలు చెప్పాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ ట్రెండ్ ఓ పెద్ద వరం. కరోనాను పక్కపెడితే.. ఓటీటీల ప్రభావంతో వినూత్నమైన కథాలోచనలకు డిమాండ్ ఏర్పడింది" అంటున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన తీసిన తొలి చిత్రం 'అ!' జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకుంది. రెండో చిత్రం 'కల్కి'తో తన ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. ప్రస్తుతం జాంబీ జోనర్‌లో 'జాంబీరెడ్డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..
జాంబీ జోనర్‌లో సినిమా చేయాలనే ఆలోచన వెనుక కారణం?
తెలుగు ప్రేక్షకులకు ఓ భిన్నమైన అనుభూతిని పంచాలన్నదే కారణం. జాంబీ జోనర్ కానీ, ఆ సన్నివేశాలు కానీ కొత్తగా ఉంటాయి. హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ ఈ నేపథ్యంతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి. వాటిని చూసినవాళ్లూ సరికొత్త అనుభూతికి గురయ్యేలా 'జాంబీ రెడ్డి' ఉంటుంది. ఈ కథ జాంబీ నేపథ్యంలో సాగినా తెలుగు వాతావరణానికి తగ్గట్టే ఉంటుంది.
తెలుగు ప్రేక్షకులకు జాంబీ జోనర్ సినిమాలు కొత్త కదా, ఇదో ప్రయోగం అనుకోవచ్చా?
'జాంబీ రెడ్డి' చేయడం వెనకున్న ప్రధాన కారణం అదే. తెలుగులో ఇలాంటి సినిమా కొత్త కదా? ఇలాంటి సినిమాలు ఆడతాయా? తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించరేమో అని ఏ కథల గురించైతే మాట్లాడుతుంటారో, అలాంటివే తెలుగులో చేయాలన్నది నా ఉద్దేశం. నా వరకు 'జాంబీరెడ్డి' తెలుగులో ఓ ప్రయోగాత్మక వాణిజ్య చిత్రం. నేను గతంలో తీసిన సినిమాల్లాగా కాకుండా, విడుదలకు ముందే ప్రచార చిత్రాల ద్వారా కథంతా చెప్పేస్తాం.
కరోనా వైరస్ స్ఫూర్తితో రాసుకున్న కథేనా ఇది?
కరోనా వైరస్ ప్రభావం కంటే ముందే రాసుకున్న కథ ఇది. మొదట వైరస్‌కు వేరే పేరు అనుకున్నాం. అయితే చిత్రీకరణ ఆరంభంలోనే చైనాలో కరోనా ఉధృతి పెరగడం, దాని గురించి అందరూ మాట్లాడుకోవడం వల్ల ముందు అనుకున్న వైరస్‌ను 'కరోనా వైరస్'గా మార్చేశాం. త్వరలోనే విడుదలయ్యే టీజర్‌తోనే..కరోనా వైరస్‌కూ, సినిమాలోని జాంబీకి ఎలా ముడిపెట్టామన్నది తెలుస్తుంది. ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది. కరోనా సమయంలో సాగే కథే ఇది.
పురాణాలతో ముడిపెట్టి పాత్రల్ని రాసుకోవడం మీకు ఇష్టమా?
సరస్వతీ శిశు మందిర్‌లో చదువుకున్నా. అందులో చిన్నప్పట్నుంచి పురాణాలన్నీ నేర్పిస్తారు. రామాయణం, భారతం, భాగవతం చిన్నప్పట్నుంచి చదువుతున్నాను కాబట్టి, అది కథ రాసుకునేటప్పుడైనా, సినిమా చేసేటప్పుడైనా బయటికొస్తూ ఉంటుంది.
"మన దగ్గర కథలకు కొదవ లేదు. ఎప్పుడైనా కథల గురించి ఆలోచించుకునే పరిస్థితే రాకూడదు. అందుకే విరామం సమయంలో కొత్త కథలు రాయడంపై దృష్టి పెడుతుంటా. ప్రస్తుతం నా దగ్గర పూర్తిస్థాయిలో సిద్ధమైన కథలు 32 ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వెబ్ సిరీస్‌లుగా తీస్తున్నా"
"అ! 2' కోసం ఎప్పుడో స్క్రిప్టు సిద్ధమైంది. హిందీ, తెలుగు భాషల్లో తీద్దామని పలువురు నిర్మాతలు ముందుకొచ్చారు. ఆ సమయంలో నేను మరో అగ్ర కథానాయకుడితో సినిమా ప్రయత్నాల్లో ఉన్నా. దాంతో కుదర్లేదు. 'అ!'ని కూడా హిందీలో రీమేక్ చేద్దామని ముందుకొచ్చారు చాలామంది. కానీ మనం ఏదైనా మన ఊళ్లో చేస్తే ఓ ప్రత్యేకమైన కిక్ వస్తుంది కదా. అందుకే 'అ 2' సినిమాను కూడా ముందు తెలుగులోనే చేస్తా. త్వరలోనే ఆ సినిమాను మొదలు పెడతాం".