తలైవా రజనీకాంత్ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్ల వద్ద పండగ వాతావరణమే. అదే ఆయన సినిమా పండుగకు వస్తే ఆ హంగామానే వేరు. అలా మురగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం 'దర్బార్'. ఇందులో దాదాపు పాతికేళ్ల తర్వాత రజనీ వెండి తెరపై పోలీసు అధికారి గెటప్‌లో దర్శనమిచ్చాడు.
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం... పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగానూ రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఈ ఏడాది విడుదలైన మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే. అయితే మొదటి ఐదు రోజుల్లోనే రూ.150కోట్లు వసూళ్లు రాబట్టుకొంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
"ఆట ఎవరైనా ఆడతారు.. కానీ సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుంది.. ఇదిగో దర్బార్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు" అని రాసుకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార, ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి, కీలక పాత్రలో నివేథ థామస్ కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.