జ్యోతి కుమారి అంటే ఎవరికీ తొందరగా తెలియకపోవచ్చు.. కానీ లాక్‌డౌన్ వేళ తండ్రిని కూర్చొబెట్టుకొని 12వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కిన బిహార్ బాలిక అంటే టక్కున ప్రతిఒక్కరికి గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తనకున్న తెగువ, ఓర్పు, తండ్రి పట్ల ప్రేమ దేశాల్నే దాటింది. ఏకంగా అమెరికా అధ్యకుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా జ్యోతిని ప్రశంసించారు.
అయితే తాజాగా జ్యోతి సైకిల్ యాత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో తానే టైటిల్ రోల్ షోషించబోతుంది. సినిమాలు, డాక్యుమెంటరీలు తీయాలన్న మక్కువ ఉన్న నలుగురు యువకులు మిరాజ్, ఫైరోజ్, కృష్ణ, సజిత్ నంబీర్.. జ్యోతి జీవిత గాథ హక్కులు కొనుగోలు చేశారు. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
జ్యోతి తన తండ్రిని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎలాంటి అవరోధాలను ఎదుర్కొందనేదే ఈ సినిమా కథ. లాక్‌డౌన్ వలస కూలీల జీవితాలను ఏ విధంగా చిదిమేసింది అనే అంశాలను కూడా స్పృశించనున్నారు. జ్యోతి సైకిల్ యాత్ర చేసిన గురుగ్రామ్ నుంచి దర్భంగా మధ్య ప్రాంతాల్లోనే ఈ సినిమాను చిత్రీకరించనున్నారు.
ఇది 'జ్యోతి' కథ
జ్యోతి కుమారిది బిహార్. బతుకుదెరువు కోసం వాళ్ల కుటుంబం హరియాణాలోని గురుగ్రామ్‌కు వలస వచ్చింది. నాన్న మోహన్ ఆటో నడిపితేనే వాళ్ల కుటుంబం గడిచేది. గాయం కావడం వల్ల అతను ఆటోను తిరిగి ఇచ్చేయడం.. లాక్‌డౌన్ కారణంగా ఏ ఆదాయం లేకపోవడం వల్ల వారి జీవితం దుర్భరమైంది. దీంతో వాతావరణం అనుకూలంగా లేకపోయినా.. ఇబ్బందులు ఎదురైనా నాన్నని వెనకాల కూర్చోబెట్టుకుని ఏకబిగిన ఏడు రోజుల పాటు సైకిల్ తొక్కి వార్తల్లో నిలిచింది జ్యోతి.
జ్యోతి సైక్లింగ్ నైపుణ్యాన్ని గుర్తించిన భారత సైక్లింగ్ సమాఖ్య (సీఎస్‌ఎఫ్) జ్యోతిని ట్రయల్స్‌కు కూడా పిలిచింది.
ఇది చూడండి : భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్ సలాం!