మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ప్రముఖ సినీనటుడు సీవీఎల్ నర్సింహారావు పోటీ నుంచి తప్పుకొన్నారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మా సభ్యుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించిన సీవీఎల్.. ఇప్పుడు ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికి తన మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. చాలా రోజుల నుంచి తాను 'మా' సభ్యుల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించానని, వాటిని తన స్నేహితుల సహకారంతో అమలు చేసేందుకు ఒంటరిగానే కృషి చేస్తానని తెలిపారు. అధ్యక్ష బరిలో నిలిచిన తనకు రాముడు కలలోకి వచ్చి సభ్యుల సంక్షేమం కావాలా, అధ్యక్ష పదవి కావాలా అని ప్రశ్నించాడని చమత్కరించిన సీవీఎల్.. పరోక్షంగా తనకు బెదిరింపులు వచ్చాయనే విషయాన్ని వెల్లడించారు. తన ఉపసంహరణకు గల బలమైన కారణాన్ని రెండు రోజుల్లో మీడియా ముఖంగా బయటపెట్టనున్నట్లు సీవీఎల్ తెలిపారు. 'మా' ఎన్నికల్లో పోటీకి సభ్యత్వం లేని విజయశాంతి తనకు మద్దతు ప్రకటించడం పట్ల కృతజ్ఞత తెలిపిన సీవీఎల్.. అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా సభ్యుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండాలని కోరారు.
ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులతోపాటు అధ్యక్ష పదవికి సీవీఎల్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల నామినేషన్ దాఖలు చేసి ఈ ఉదయమే తన మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.
ఇదీ చదవండి:ఆయన గెలిస్తే నా సమస్యలు బయటపెడతా: పూనమ్