కరోనా వైరస్ సినీ పరిశ్రమనే కాదు.. దానిపై ఆధారపడిన అన్ని వర్గాలను ఘోరంగా దెబ్బతీస్తోంది. ప్రధానంగా సినిమా థియేటర్ల విషయంలో అన్‌లాక్4లోనూ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల సినిమా హాల్‌నే నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఏళ్ల తరబడి జీవితాలను వెల్లదీస్తోన్న చాలామంది ఆపరేటర్ల బతుకులు భారంగా మారాయి. బయటకువెళ్లి వేరే పనిచేసుకోలేక... అన్నంపెట్టిన థియేటర్‌ను వదులుకోలేక సతమతమవుతున్నారు. నిశ్శబ్దం ఆవహించిన థియేటర్లలో మౌనంగా రోదిస్తున్నారు. ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు కలిపి 10వేల థియేటర్లు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో 1800 హాల్స్ ఉన్నాయి. ఒక్కో థియేటర్లో ఇద్దరు, ముగ్గురు ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అంటే 5 వేలకుపైగానే ఆపరేటర్లు సినిమా థియేటర్‌ను నమ్ముకుని జీవిస్తున్నారు. వారికి యాజమాన్యాలు గరిష్టంగా 25 వేల రూపాయలు, కనిష్టంగా 20 వేల రూపాయలు నెల జీతంగా ఇస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌తో ఒక్కసారిగా థియేటర్లను మూసివేశారు. ఇప్పటికీ ఆరు నెలలు గడిచింది. ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి.
ఈ నేపథ్యంలో మొదట మూడు నెలలు పూర్తి జీతం చెల్లించాయి. కానీ రోజులు గడిచే కొద్ది థియేటర్లపై స్పష్టత లేకపోవడం వల్ల యాజమాన్యాలు ఆపరేటర్ల జీతాల్లో కోతలు మొదలుపెట్టాయి. దీంతో కొన్ని థియేటర్లలో సగమే జీతాలు చెల్లిస్తుండగా మరికొన్నిచోట్ల అసలు ఇవ్వడం లేదని ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్లో పనిచేసే ఆపరేటర్... కుటుంబపోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు. మరికొందరు అప్పులు చేసి జీవినం సాగిస్తున్నారు.
అయితే కరోనా సంక్షోభ కాలంలో సినీ కార్మికులను ఆదుకున్న చిత్ర పరిశ్రమ పెద్దలు, పంపిణీదారులు.. సినిమా ఆపరేటర్ల ను విస్మరించారని పలువురు ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలు, నటీనటులుగా ఎదగడానికి ఆర్థికంగా దోహడపడుతున్న సినిమా థియేటర్, అందులో పనిచేసే కార్మికులను పట్టించుకోకపోవడం బాధగా ఉందని వాపోతున్నారు. పరిశ్రమ వర్గాల కంటే అగ్ర కథానాయకుల అభిమానులు ఓ పూట వంటసరుకులు ఇచ్చి ఆదుకున్నారని కంటతడి పెట్టుకుంటున్నారు.
థియేటర్లు మూతపడినా ఇంట్లో ఉండలేక కొంతమంది ఆపరేటర్లు సొంత ఖర్చులతో సినిమా హాల్ కు వస్తున్నారు. నిశ్బద్దంగా ఉన్న థియేటర్ ను చూసుకుంటూ కూర్చుంటున్నారు. నిత్యం ప్రొజెక్టర్లను శుభ్రం చేసుకుంటూ వాటిని కాపాడుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచిన ప్రభుత్వం.. థియేటర్ల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వాటిని తెరిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందనడటంలో ఏ మాత్రం నిజం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుని నడుస్తాయని చెబుతున్నారు.
ఆపరేటర్ల కష్టాలు ఇలా ఉంటే.. యాజమాన్యాలకు కోట్లలో నష్టం వాటిల్లింది. గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు రూ.9 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఒక్కో నెలకు సుమారు రూ.1500 కోట్లను థియేటర్లు నష్టపోతున్నాయని పేర్కొంది. లక్షలాది మంది కార్మికులు ఆధారపడిన సినిమాహాల్స్ ను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 85 దేశాల్లో సినిమా థియేటర్లను పునఃప్రారంభించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రేక్షకులకు ఆయా దేశాల్లో సినిమా హాల్స్ వినోదాన్ని అందిస్తున్నాయి.