లాక్‌డౌన్ వేళ అందరిలాగే సినీ తారలూ ఇళ్లకు పరిమితమయ్యారు. అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చూస్తూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే... తమ కొత్త సినిమాల కోసం మరిన్ని ప్రణాళికలు రచిస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా అవన్నీ చేస్తూనే... మరో పక్క కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్నీ పర్యవేక్షిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకి అండగా నిలవడమే లక్ష్యంగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని సీసీసీని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలతో పాటు... తన వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు చిరంజీవి. ఆ విషయాలివీ...
కరోనా ఉద్ధృతి, దాని పరిణామాలపై మీ ఆలోచనల్ని పంచుకుంటారా?
దురాశతో ప్రకృతిని దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి ఒకసారి అదే మానవాళిని ఇలా హెచ్చరించిందేమో అనేది నా అభిప్రాయం. అవసరాలు తీర్చుకోవాలి తప్ప అత్యాశకు పోయి ముందుతరాల గురించి ఆలోచించకుండా వనరుల్ని నాశనం చేయడం తగదు. పారిశ్రామిక జీవన విధానంలో పడి, మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. అందరం ఇంటికి పరిమితమయ్యాక మన జీవితాల్ని పునశ్చరణ చేసుకున్నాం. మానవ సంబంధాల విలువ తెలిసొచ్చింది. ఈ పరిస్థితులు చూశాక.. మన జీవన విధానాన్ని సరి కొత్తగా మొదలు పెడతాం. కరోనాతో కాలుష్యం తగ్గిపోయింది. జంతువులు, పక్షులు హాయిగా బయటకొస్తున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి వంటలు చేసుకోవడం, పనుల్లో సహాయ సహకారాలు అందించుకోవడం కనిపిస్తోంది.
లాక్‌డౌన్ తర్వాత మీ దినచర్యలో ఎలాంటి మార్పులొచ్చాయి?
చిత్రీకరణల నుంచి విరామం దొరికినప్పుడు ఇంట్లో వాళ్లతో, నా పిల్లలతో ఎలాగైతే గడుపుతుంటానో.. ఇప్పుడూ అంతే. ఈ విరామ సమయాన్ని నా ఆరోగ్యపరంగా, నా భవిష్యత్ ప్రణాళికల కోసం వినియోగించుకుంటున్నా. కొన్ని సినిమాల్ని, వెబ్ సిరీస్‌ల్ని చూస్తున్నా.
చిత్ర పరిశ్రమ ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు కదా?
ఎవరం ఊహించని ఉపద్రవం ఇది. ఇప్పట్లో చిత్రీకరణలు మొదలు కావనే విషయం అర్థమైంది. పరిశ్రమపైనే ఆధార పడ్డ వేల మంది కార్మికులు ఉపాధి లేకుండా ఖాళీగా ఎలా ఉంటారనే ఆలోచనలు వచ్చాయి. దినసరి వేతనంతో పనిచేసే 14 వేల మందికి పైగా కార్మికులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ప్రదర్శనలు, సినీ నిర్మాణాలు, ఉపాధి... తదితర విషయాలపై తాత్కాలికంగా ప్రభావం ఉంటుంది. అయితే పూర్వవైభవం మాత్రం కచ్చితంగా వస్తుంది. జూన్, జులై మాసాల్లో చిత్రీకరణలకి వెళతామనే నమ్మకం ఉంది. థియేటర్లలో ప్రదర్శనలకి మాత్రం ఇంకొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
కార్మికుల్ని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ సేవలు ఎలా కొనసాగుతున్నాయి?
చిత్ర కార్మికులకి సాయం అందాలనే ఉద్దేశంతోనే రూ. కోటి విరాళం ప్రకటించా. ఆ తర్వాత మిత్రుడు నాగార్జున, ఇతర నటీనటులు, దర్శకనిర్మాతలు తమ వంతు సాయం అందించారు. కానీ, దీన్ని కార్మికులకు సరైన విధంగా ఎలా అందివ్వాలనేది సమస్య. అందుకే పరిశ్రమలో వారితో సత్సంబంధాలు ఉంటూ, వారి బాగోగుల్ని చూసే వ్యక్తుల ద్వారా అందించొచ్చని ఆలోచన చేశా. 14 వేల మంది కార్మికుల ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు అందించేలా ప్రణాళిక రూపొందించాం. ఈ క్లిష్ట పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో నెల కూడా కార్మికులకు సహాయం చెయ్యాలని మా కమిటీ, మేము నిర్ణయించుకున్నాం.
‘ఆచార్య’ చిత్రీకరణ అర్ధంతరంగా ఆగిపోవడం నిరాశకి గురిచేసిందా?
నిరాశ పడటమంటూ ఏమీ లేదు. కరోనా ఉద్ధృతి పెరుగుతోందనే విషయం అర్థమవ్వగానే మేమే చిత్రీకరణ ఆపేశాం. లాక్‌డౌన్ తర్వాత అంతే జోరుతో పనిచేస్తాం. ఇక ఈ సినిమా విషయానికొస్తే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని, చక్కటి భావోద్వేగాల్ని పంచుతుందని మాత్రం చెబుతాను.
‘ఆచార్య’లో ఉన్న మరో హీరో పాత్రలో మహేష్ నటిస్తారా లేక రామ్‌చరణా?
త్వరలోనే చూస్తారుగా.
‘ఆర్ ఆర్ ఆర్’లో రామ్‌చరణ్ టీజర్ చూశాక ఏమనిపించింది? అల్లూరి పాత్రని చేయాలనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా?
సీతారామరాజు టీజర్ చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజమౌళికి ఫోన్ చేసి అభినందించాను. ఇక సీతారామరాజు పాత్రతో దర్శకులెవ్వరూ నన్ను సంప్రదించలేదు. సీతారామరాజు పాత్రే అని కాదు కానీ... స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర ఒకటి చేయాలనే కోరిక బలంగా ఉండేది. అది ‘సైరా నరసింహారెడ్డి’తో తీరింది.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య బంధం ఎలా ఉంది?
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరు స్టార్ హీరోలు అన్నదమ్ముల్లా మెలిగితే కనుక వాళ్ల అభిమానుల మధ్య అలాంటి వాతావరణమే ఏర్పడుతుంది. ఆ విషయంలో నేనెంత తపన పడేవాణ్నో నన్ను గమనించేవాళ్లందరికీ తెలుసు. తోటి హీరోలతో సఖ్యతగా మెలిగే విషయంలో రామ్‌చరణ్ నా ఆలోచనలకి తగ్గట్టే నడుచుకుంటున్నాడు. తనే కాదు... ఇప్పుడు హీరోలంతా కూడా వాళ్ల స్టార్‌డమ్‌ని తెరవరకే చూపిస్తూ, బయట స్నేహితుల్లాగా మెలుగుతున్నారు.
మీ తరం స్టార్లు వాళ్లలాగా కలిసి నటించలేదు. కారణమేమిటి?
కథలు దొరక్కే తప్ప మరో కారణం లేదు. కథలొస్తే ఎవరు మాత్రం చేయం? ఎన్టీఆర్ - ఏఎన్నార్, కృష్ణ - కృష్ణంరాజు, కృష్ణ - నేను, ఏఎన్నార్ - నేను, నేనూ - చంద్రమోహన్, మురళీమోహన్... ఇలా మేమంతా కలిసి నటించలేదా? హీరోలు కలిసి నటించడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు.
సామాజిక మాధ్యమాల్లో మీరు చేసే పోస్టుల్లోనూ మీ టైమింగ్ కనిపిస్తుంటుంది. బాగా ఆస్వాదిస్తున్నట్టున్నారు కదా?
మొదట్లో వీటిపై నాకంత అవగాహన లేదు. మెల్లమెల్లగా వాటి అవసరం అర్థమైంది. దిశ సంఘటన, నిర్భయ ఉదంతం జరిగినప్పుడు స్పందించాలని తపించేవాణ్ని. కానీ నా చేతుల్లో అప్పుడు ఏ మాధ్యమం లేదు. అప్పుడు చరణ్ ఇలాంటి సందర్భాల్లో సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయని చెప్పాడు. అలా నా భావాల్ని, నా అభ్యర్థనల్ని అభిమానులకి తెలియజేయడమే లక్ష్యంగా ఉగాదికి సామాజిక మాధ్యమాల్లోకి అడుగుపెట్టా.
మీ జీవితంలోని అనుభవాల్ని, వాటి తాలూకు జ్ఞాపకాల్ని వీడియో రూపంలో నిక్షిప్తం చేస్తున్నారని తెలిసింది. ఆ ఆలోచన ఎప్పుడొచ్చింది?
నా అనుభవాల్ని గ్రంథస్థం చేయడంలో భాగం అది. ఇందులో కూడా నా భార్య సురేఖతో పాటు... మా అబ్బాయి రామ్ చరణ్ సలహాలు ఉన్నాయి. 42 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలు నావి. ఆ ప్రయత్నం త్వరలోనే మొదలవ్వబోతోంది.
నా కుటుంబ సభ్యులు నాకు మంచి స్నేహితులు. చిన్నప్పుడు స్కూల్‌కీ, కాలేజీకి వెళ్లే రోజుల్లోనూ... ఎన్.సి.సి క్యాంప్‌లోనూ చాలామంది స్నేహితులయ్యేవారు.ఇప్పుడు కూడా మేం అన్నదమ్ములం, తోబుట్టువులం కలిశామంటే స్నేహితుల్లాగే అల్లరి చేస్తుంటాం. మామధ్య కుటుంబానికి సంబంధించిన విషయాలే తప్ప... సినిమా కానీ, రాజకీయాలకి సంబంధించిన విషయాలు కానీ అస్సలు చర్చకు రావు.
నిత్యావసరాల పంపిణీ మొదలైన వారం రోజులకు నాకు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేశారు. ‘కరోనాపై మీరు చేసిన పాట చూశాను. మీరు చేస్తున్న సహాయ కార్య క్రమాలు కూడా మా దృష్టికి వచ్చాయి. మేం తీసే లఘు చిత్రంలో మీరు నటించాలి. దాని ద్వారా దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల్లోని కార్మికులకు సహాయం చేద్దాం అనుకుంటున్నాం’ అన్నారు. అదొక అదృష్టంగా భావించా. తర్వాత నేను వీడియో పంపడం, అమితాబ్ తెలుగు సినీ కార్మికుల కోసం రూ.1500 విలువగల 12 వేల ఓచర్‌లు పంపడం చకచకా జరిగిపోయాయి. అది ఎంతో సంతృప్తినిచ్చింది.
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాణ్ని. లాక్‌డౌన్ అవ్వగానే అందరికీ నిత్యావసర వస్తువులు దొరుకుతాయో లేదో, రైతులు కాయగూరలు తీసుకొచ్చే పరిస్థితులుంటాయో లేదో అని, వస్తువుల్ని పొదుపుగా వాడుకుందామంటూ ఓ వీడియో ద్వారా చెప్పా. చిన్నప్పుడు ఒక పులుసు, ఒక చారు, మజ్జిగతో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నా. అమ్మ నాతోపాటే ఉంటుంది కాబట్టి, చిన్నప్పుడు తిన్న వంటకాల్ని గుర్తు చేసి చెబుతుంటా. వాటిలో కొన్ని వండి పెడుతూ ఉంటుంది.
ఇదీ చూడండి : మూడు భారీ ప్రాజెక్టుల్లో కియారా ఛాన్స్ కొట్టేసింది!