నల్లని కళ్లు... ఆ కళ్లల్లో జాలి... నిశితంగా చూస్తే, అంతులేని కారుణ్యం!
తెల్లని మొహం... ఆ మొహంలో అమాయకత్వం... పరిశీలనగా చూస్తే, కట్టిపడేసే మానవత్వం!
వెర్రిబాగుల వేషం... ఆ వేషంలో హాస్యం... తేరిపారి చూస్తే, నిలువెత్తు అభినయం!
−హాస్య నట చక్రవర్తిగా చార్లీచాప్లిన్ విశ్వరూపం!!
చూడగానే నవ్వొచ్చేలా... నవ్విస్తూనే ఆలోచింపజేసేలా...
ఆలోచిస్తుండగానే మనసు కలుక్కుమనిపించేలా...
కలుక్కుమనేలోగానే పొట్టచెక్కలయ్యేలా...
పొట్టచెక్కలవుతుండగానే గుండెను మెలిపెట్టేలా...
చార్లీచాప్లిన్ చవిచూపించిన వెండితెర విన్యాసం!!
మూకీలైనా... టాకీలైనా...
రెండు నిముషాలైనా... రెండు గంటలైనా...
పిల్లలైనా... పెద్దలైనా...
ఆనందించి, ఆస్వాదించి, అనుభవించి, పరవశించి...
కేరింతలు కొట్టి, చప్పట్లు కొట్టి...
పట్టుపట్టి మళ్లీమళ్లీ చూసేలా చేసే
అపురూప, అద్భుత, అసాధారణ, అనన్యసామాన్య... కళాప్రదర్శనం!!
ఓసారి 'యూట్యూబ్' లోకి వెళ్లి, సెర్చ్‌బాక్స్‌లో 'చార్లీ చాప్లిన్' అని కొట్టి చూడండి. వచ్చే వీడియోల్లో ఏదో ఒక దాన్ని నొక్కండి. ఆపై... 'నవ్వనుగాక నవ్వను' అని తీర్మానించుకుని మరీ ఆ వీడియో చూడండి... లోపలి నుంచి నవ్వు తెరలుతెరలుగా తన్నుకురాకపోతే అడగండి!
అదీ చార్లీచాప్లిన్ అంటే! అందుకే మూకీల నాటి వాడైనా, నేటికీ చెప్పుకునే అరుదైన నటుడిగా నిలిచాడు చార్లీచాప్లిన్! కానీ.. చార్లీచాప్లిన్ పంచిన నవ్వులు, కష్టాల కొలిమిలో కాలి రాటుదేలినవి! అతడు పంచిన అభినయం, పేదరికం ముంగిట నిగ్గుదేలిన అనుభవాల సారం. ఓ సామాన్య పేద కుటుంబంలో పుట్టి, తినీ తినక అనేక బాధలు పడుతూ... పట్టెడన్నం కోసం ఎవేవో పనులు చేస్తూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారుడిగా చార్లీచాప్లిన్ ఎదిగిన తీరును తెలుసుకోవాలంటే అతడి జీవితంలోకి ఓసారి తొంగి చూడాలి.
చార్లీచాప్లిన్‌కు తొలిసారిగా 'షెర్లాక్ హోమ్స్' అనే నాటకంలో చిన్న పాత్ర దక్కింది. ఆపై హాస్యనటునిగా పేరు తెచ్చుకున్న చార్లీ, మొదటి సారిగా 1913 డిసెంబర్ 16న సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.
కాల పరీక్షలకు ఎదురు నిలిచి..
చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్‌గా లండన్‌లో పుట్టిన ఓ కుర్రాడు, తన పేరుకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం గౌరవప్రదంగా ఇచ్చే 'సర్' బిరుదును పొందడం వెనుక... అతడి 88 ఏళ్ల జీవితంలో 75 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వెండితెర ప్రస్థానం ఉంది. 1889 ఏప్రిల్ 16న పుట్టిన చాప్లిన్, 1977 డిసెంబర్ 25న మరణించేలోగా వేదనాభరిత రోజుల్ని, వైభవోపేతమైన దశల్ని, అవమానకరమైన పరిస్థితుల్ని, వివాదప్రదమైన స్థితిగతులనూ అనుభవించాడు.
కడుపు నింపుకోవడం కోసం పని చెయ్యక తప్పని బాల్యం నుంచి దొరికిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, అనుభవాలు పేర్చుకుంటూ, నైపుణ్యాలు కూర్చుకుంటూ... హాస్య నటుడిగా, చిత్ర నిర్మాతగా, సంగీతకారుడిగా, రచయితగా ప్రపంచ స్థాయికి ఎదిగి సినీరంగంలో చెరగని ముద్ర వేయగలిగాడు. ఒకవైపు వెండితెర ప్రస్థానం వెలుగులతో కొనసాగుతుండగానే, అతడి వ్యక్తిగత జీవితం వైవాహిక పొరపాట్లతో ముడిపడుతూ సాగింది. అందుకే నాలుగు పెళ్లిళ్లు, 11 మంది సంతానంతో చాప్లిన్ జీవితం మరోవైపు వివాదాస్పద కోణానికి దర్పణం పట్టింది.
తన తొలి చిత్రం తనకే నచ్చలేదు..
చార్లీచాప్లిన్ బాల్యమంతా పేదరికంలో, బాధల మధ్యే గడిచింది. తండ్రి చార్లెస్ చాప్లిన్, తల్లి హన్నా (లిలీహార్లీ)లు ఇద్దరూ నాటకరంగంలో గాయకులు, నటులే అయినా అంతంత మాత్రం ఆదాయంతో నెట్టుకొచ్చేవారు. చాప్లిన్‌కు ఊహ తెలిసేనాటికే తండ్రి చనిపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. దీనికి సాయం తల్లి మానసిక స్థితి సరిగా లేక చిన్నారి చాప్లిన్, సోదరుడు సిడ్నీ ఇద్దరూ పొట్టగడవడం కోసం ఏవేవో పనులు చేయకతప్పలేదు. తల్లిదండ్రులు ఆస్తులేవీ ఇవ్వకపోయినా వారసత్వంగా అలవడిన నటనే వారిని రంగస్థలం వైపు అడుగులు వేయించింది. అవకాశాన్ని బట్టి పాట, ఆట, నటనలతో అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అలా చాప్లిన్ చిన్నతనంలోనే తనదైన హాస్య నటనతో మంచి గుర్తింపు పొందగలిగాడు.
19 ఏళ్ల వయసులో ఓ కంపెనీతో కుదిరిన ఒప్పందం వల్ల చాప్లిన్ అమెరికాలో అడుగుపెట్టాడు. అదే అతడి జీవితానికి తొలి మేలు మలుపు. అక్కడి ప్రేక్షకులకు చాప్లిన్ హాస్యం నచ్చడం వల్ల 1913లో తొలి సినిమా అవకాశం వచ్చింది. భవిష్యత్తులో వెండితెరపై బలమైన ముద్ర వేసిన చాప్లిన్ తొలి సినిమా ఏంటో తెలుసా? కేవలం ఒకే ఒక్క రీలుతో రూపొందిన 'మేకింగ్ ఏ లివింగ్' సినిమా. ఇది 1914 ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఆ సినిమా చాప్లిన్‌కు అస్సలు నచ్చలేదు.
అది అతడి సృష్టే..
రెండో సినిమాకు చాప్లిన్, తనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన వేషధారణను స్వయంగా ఎంపికచేసుకున్నాడు. అదే, వదులుగా వేళ్లాడే ప్యాంటు, బిగుతుగా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు, చిట్టి మీసం.. దాన్నే 'ది ట్రాంప్ క్యారెక్టర్' అంటారు. ఈ వేషంలో చాప్లిన్‌ను చూపిస్తూ విడుదలైన సినిమా 'కిడ్ ఆటో రేసెస్ ఎట్ వెనిస్'. ఆ వేషం వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించింది. దాంతో ఆపై చాప్లిన్ వెండితెర ఆహార్యం అదే అయ్యింది.
అప్పటి నుంచి చాప్లిన్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరగడం వల్ల తొలి దర్శకత్వ అవకాశం 'కాట్ ఇన్ ద రైన్' (1914)తో వచ్చింది. అది సూపర్‌హిట్. ఇక ఆపై వారానికో సినిమా వంతున చాప్లిన్ ఎన్నో చిత్రాలు రూపొందించాడు. చాప్లిన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఎన్నో కంపెనీలు అతడితో ఒప్పందం కోసం క్యూ కట్టాయి. అలా 26 ఏళ్లకే ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడిగా చాప్లిన్ ఖ్యాతి పొందాడు. 'ది ఫ్లోర్ వాకర్', 'ది ఫైర్‌మేన్', 'ది వేగబాండ్', 'వన్ ఏఎమ్', 'ది కౌంట్', 'ది పాన్‌షాప్'.. లాంటి ఎన్నో సినిమాల్లో యువ చాప్లిన్ కడుపుబ్బ నవ్వించాడు. ఆపై సొంతంగా 'యునైటెడ్ ఆర్టిస్ట్స్ ' సంస్థను ప్రారంభించి నిర్మాతగానూ మారాడు.
అలా అమెరికాను వదిలి..
చార్లీ చాప్లిన్ తొలి పూర్తిస్థాయి చిత్రం 'ది కిడ్' (1921). అరవై ఎనిమిది నిమిషాల నిడివి ఉండే ఇది చాప్లిన్ చిత్రల్లోకెల్లా పెద్దది. మూడేళ్ల ఈ సినిమా 50 దేశాల్లో ప్రదర్శితమై అంతులేని ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వచ్చిన 'ఎ ఉమన్ ఆఫ్ ప్యారిస్' (1923), 'ది గోల్డ్ రష్' (1925), 'ది సర్కస్' (1928) లాంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. అప్పటికి మూకీలు పోయి, టాకీలు వచ్చినా కొంత కాలం పాటు చాప్లిన్ వాటికి దూరంగా ఉన్నాడు. అందుకే 'సిటీ లైట్స్' (1931), 'మోడర్న్ టైమ్స్' (1936) చిత్రాలను డైలాగులు లేకుండానే రూపొందించాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను వ్యంగ్యంగా అనుకరిస్తూ తీసిన 'ది గ్రేట్ డిక్టేటర్' (1940) నుంచి చాప్లిన్ పదేళ్ల పాటు రాజకీయ వివాదాల్లోను, వ్యక్తిగత జీవితపు ఒడుదుడుకుల్లోను కూరుకుపోయాడు.
అతడిపై కమ్యూనిస్ట్ సానుభూతిపరుడిగా ముద్ర పడడం సహా తనకన్నా ఎంతో చిన్న వాళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం విమర్శలకు గురిచేసింది. కొన్ని కేసులు చుట్టుముట్టిన క్రమంలో అన్నేళ్లు తనకు ఆశ్రయమిచ్చిన అమెరికాను విడిచి వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆపై స్విట్జర్లాండ్ వెళ్లి 'మాన్సియర్ వెర్‌డాక్స్' (1947), 'లైమ్‌లైట్' (1952), 'ఎ కింగ్ ఇన్ న్యూయార్క్' (1957), 'ఎ కౌంటెస్ ఫ్రమ్ హాంగ్‌కాంగ్' (1967) లాంటి తన శైలికి భిన్నమైన సినిమాలు తీశాడు.
ఆస్కార్ వేదికపై అరుదైన గౌరవం..
అమెరికా వదిలి పెట్టిన చార్లీచాప్లిన్ 20 ఏళ్ల తర్వాత తిరిగి అమెరికా రావాల్సివచ్చింది. అది ఆస్కార్ అవార్డు అందుకోవడం కోసం! 1972లో అకాడమీ చాప్లిన్‌కు గౌరవ అవార్డును ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోడానికి అతడు వేదిక మీదకు వచ్చినప్పుడు ఆ వేడుకకు హాజరైన ఆహూతులంతా లేచి నిలబడి 12 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా చప్పట్ల వర్షం కురిపించారు. ఆస్కార్ వేడుకల చరిత్రలోనే అత్యధిక సమయం నమోదైన 'స్టాండింగ్ ఒవేషన్' అది!
తర్వాత ఈ హాస్య నట చక్రవర్తి ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. మాటలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమవాల్సి వచ్చింది. 1974లో 'మై లైఫ్ ఇన్ పిక్చర్స్' పేరుతో చిత్రాలతో కూడిన ఆత్మకథ వచ్చింది. 1975లో 'ద జెంటిల్‌మేన్ ట్రాంప్' పేరిట అతడి జీవితంపై ఓ డాక్యుమెంటరీ విడుదలైంది. అదే ఏడాది రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా బ్రిటన్ అత్యున్నత పురస్కారం 'నైట్‌హుడ్'ను చక్రాల కుర్చీ మీద నుంచే అందుకున్నాడు చాప్లిన్. జీవితమంతా ప్రపంచాన్ని నవించడానికే వెచ్చించిన చార్లీచాప్లిన్ (88) 1977 డిసెంబర్ 25న నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశాడు. ఎప్పటికీ తనను తల్చుకునే సినీ అభిమానుల గుండెల్లో ఓ చిరునవ్వుతో పాటు, ఓ విషాదాన్నీ వదలివెళ్లాడు!!
మరికొన్ని జ్ఞాపకాలు..
- చాప్లిన్ తన మొదటి భార్య మిడ్రెడ్ హ్యారిస్‌ను 1918లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు పుట్టినా రెండు రోజులకే చనిపోయాడు. తర్వాత ఇద్దరూ రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. రెండో భార్య లిటా గ్రే 'ది కిడ్', 'ది గోల్డ్ రష్' చిత్రాల్లో నటించింది. వారికిద్దరు పిల్లలు. మూడేళ్లకే ఈ బంధం ముగిసింది. మూడోసారి పాలెట్ గొడార్డ్‌ను 1936 పెళ్లి చేసుకున్నాడు. ఈమె 'మోడర్న్ టైమ్స్', 'ది డిక్టేటర్' సినిమాల్లో కనిపించింది. వీరి బంధం ఐదేళ్లకే ముగిసింది. ఆ తర్వాత 53 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఊనా ఓనీల్‌ను 1943లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిది మంది సంతానం.
- ప్రతి సినిమాలోని ప్రతి సన్నివేశంలో కనిపించే చార్లీచాప్లిన్ ఒకే ఒక చిత్రంలో మాత్రం ఓ అనామకుడిగా, కొన్ని సెకన్లు మాత్రమే కనిపిస్తాడు. అదీ ఓ పోర్టర్‌గా! పైగా అది హాస్యప్రధానమైన సినిమా కాదు. ఓ రొమాంటిక్ డ్రామా. ఎందుకంటే చాప్లిన్‌కు సీరియస్ సినిమా తీయాలనే కోరిక ఉండడమే. 1923లో విడుదలైన 'ఏ ఉమన్ ఆఫ్ ప్యారిస్' చిత్రం విజయవంతమైంది.
- 'ది సర్కస్' చిత్రం చాప్లిన్‌కు తొలి అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే అప్పటికి 'ఆస్కార్' అనే పేరు ఆ వేడుకకు లేదు. దీన్ని 1929లో తొలి వేడుకలో ఇచ్చారు.