1964 ఆగస్టు 2న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాంగ్‌బీచ్ నగరంలో అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ జరుగుతోంది. స్థానిక మున్సిపల్ స్టేడియంలో కరాటేకు ఆద్యుడైన ఎడ్ పార్కర్, టోర్నీని నిర్వహించారు. పోటీల్లో అప్పటివరకు జరిగిందొక ఎత్తు. ప్రసంగాలు, కొన్ని మ్యాచ్‌లు జరిగాక 21వ ఐటమ్‌గా ఓ కుర్రాడి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ప్రారంభమైంది. సన్నగా చాకులా ఉన్న ఆ ఐదడుగుల ఏడుంగుళాల కుర్రాడు చైనీస్ సంప్రదాయ కుంగ్‌ఫూ దుస్తులతో అడుగుపెట్టాడు. కుడిచేతి చూపుడు వేలు, బొటనవేలు నేలకు ఆనించి పుషప్స్ తీయడం మొదలుపెట్టాడు! ప్రేక్షకులు ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. కానీ వాళ్లకు తెలియదు. అతడి తర్వాతి విన్యాసం ప్రపంచాన్నే కుదిపేస్తుందని! ఆ విన్యాసం పేరు.. వన్ ఇంచ్ పంచ్!
కాలిఫోర్నియాకు చెందిన బాబ్ మేకర్ తన ఛాతి దగ్గర చెక్క అనించుకుని నిలబడగా కేవలం అంగుళం దూరంలో పిడికిలి బిగించి నిలబడ్డాడా కుర్రాడు. శరీరంలో శక్తినంతా పిడికిట్లోకి కేంద్రీకరించి కన్ను మూసి తెరిచేలోపు.. బలంగా ఒకే ఒక ముష్ఠి ఘాతం విసిరాడు! అంతే... ఎదురుగా ఉన్న బాబ్ బలమైన తుఫాను తాకిడికి వణికిన చిగురుటాకులా వెనక్కి వెళ్లి అక్కడ ఉన్న ఓ కుర్చీలో పడ్డాడు. మరుక్షణం ఆడిటోరియం అంతా హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత అతడి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది! ఆ చైనా కుర్రాడే బ్రూస్‌లీ! మార్షల్ ఆర్ట్స్ యోధుడిగా, వెండితెరను ఏలిన తారగా, రచయితగా పేరొందిన బ్రూస్‌లీలో.. చాలా మందికి తెలియని కోణం తాత్వికత. 'ఎలాంటి పద్ధతులూ లేని ఓ కొత్త పద్ధతిని నేను' అని ప్రకటించుకున్న తాత్వికుడు బ్రూస్‌లీ. శుక్రవారం(నవంబరు 27) అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
'ఎటంటర్ ద డ్రాగన్'తో సంచలనం
బ్రూస్‌లీ నటించిన 'ఎంటర్ ద డ్రాగన్'... హాలీవుడ్‌ను ఊపు ఊపిన చిత్రం. అతడి ప్రతిష్ఠను తారస్థాయికి చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే తపన కలిగించింది. ఆ రోజుల్లో 8.5 లక్షల డాలర్ల ఖర్చుతో తీస్తే.. 2.2 కోట్ల డాలర్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. హాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమాతో ఆ స్థాయికి ఎదిగిన తొలి ఆసియా వ్యక్తి బ్రూస్ లీ. అయితే అతడు ఆ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో కఠోర శ్రమ, చెప్పుకోవాల్సిన చరిత్ర ఉంది.
జననం
శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనాటౌన్ జాక్సన్ స్ట్రీట్ ఆస్పత్రిలో గ్రేస్ హూ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు తల్లితండ్రులు జున్ ఫాన్ అని పేరుపెట్టారు. జున్‌ఫాన్ అంటే.. 'తిరిగి వస్తాడు' అని అర్థం. డాక్టర్ మేరీ గ్లోవర్ మాత్రం ఆ బాలుడికి 'బ్రూస్' అనే ఇంగ్లీషు పేరు పెట్టింది. అతడే తర్వాతి కాలంలో బ్రూస్‌లీ అయ్యాడు.
నిజానికి బ్రూస్‌లీ తండ్రి లీ హూమ్ చెన్ పేరొందిన ఒపేరా ఆర్టిస్ట్. అమెరికాలో బోలెడంత మంది చైనా వాళ్లు ఉండడం వల్ల ప్రదర్శనలివ్వడానికి తరచూ అక్కడికి వెళ్తుండేవాడు. అలా వెళ్లినప్పుడే బ్రూస్ అక్కడ పుట్టాడు. జన్మతః అమెరికన్ అయ్యాడు కానీ బ్రూస్‌కు 3 నెలల వయసులో లీ దంపతులు తమ స్వస్థలం హాంకాంగ్‌కు తిరిగి వెళ్లిపోయారు. 18 ఏళ్లు వచ్చేదాకా బ్రూస్ అక్కడే పెరిగాడు.
అందుకే మార్షల్‌ఆర్ట్స్
బ్రూస్ చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరితో ఫైటింగ్ చేస్తూనే ఉండేవాడు. రోజుకో గొడవ ఇంటి మీదకు తెచ్చేవాడు! అతడిని అదుపులో పెట్టడానికి మార్షల్ ఆర్ట్స్ మార్గమనే నిర్ణయానికి వచ్చారు తల్లిదండ్రులు. మాస్టర్ యిప్ మాన్ దగ్గర చేర్చారు. వింగ్‌చున్ కుంగ్‌ఫూ శిక్షణలో దిట్ట ఆయన. వింగ్‌చున్ పోరాట శైలిలో సుప్రసిద్దమైనదే... వన్ ఇంచ్ పంచ్. అక్కడ ఒక గొప్ప యోధుడిలా తయారయ్యాడు బ్రూస్. అప్పటికి అతడి వయసు కేవలం 18 సంవత్సరాలు. అనుకున్నట్లే మార్షల్ ఆర్ట్స్ అతడి శక్తిని, వేగాన్ని అదుపులో పెట్టగలిగాయి కానీ, ఎవరైనా కవ్విస్తే కాలుదువ్వే కోపం మీద నియంత్రణ ఇంకా రాలేదు. ఈ క్రమంలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నేరగాళ్లతో ఫైటింగ్ చేశాడొకసారి. ఈ సారి ఇంటికి పోలీసులు వచ్చారు. మళ్లీ ఇలా జరిగితే అరెస్ట్ చేస్తామన్నారు. దీంతో బ్రూస్ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఏంచేయాలనుకున్నారు. జన్మతః అమెరికన్ పౌరసత్వం ఉంది కాబట్టి.. అక్కడికి పంపించేద్దామనుకున్నారు. అలా 1959లో జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లే పడవ ఎక్కాడు బ్రూస్లీ.
పొగరంతా దిగిపోయిన వేళ..
రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేయడం సహా రకరకాల పనులు చేశాడు బ్రూస్‌లీ. కాలేజీ చదువు మధ్యలోనే మానేసి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ మొదలుపెట్టాడు. తర్వాత ఓక్లాండ్‌లో మరో కుంగ్‌ఫూ ఇన్‌స్టిట్యూట్. 1964లాంగ్‌బీజ్ ఇంటర్‌నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో వన్ ఇంచ్ పంచ్‌తో బ్రూస్ బాగా పాపులర్ అవడం వల్ల... ఎక్కడెక్కడి మార్షల్ ఆర్ట్స్ యోధులూ అతడితో పోరుకు సిద్ధమంటూ లేఖలు పంపసాగారు. అలాంటి ఓ లేఖ పంపిన వాంగ్ జాక్‌మాన్‌తో బ్రూస్ పోరుకు సిద్ధమయ్యాడు. అప్పటికి మంచి పొగరు మీదున్నాడు బ్రూస్‌లీ. అతడితో పోరంటే నిమిషాలు కాదు. సెకన్లే! అందుకే తనను పోరుకు ఆహ్వానించిన వాంగ్ జాక్‌ను తలుచుకుని జాలిపడ్డాడు. కానీ వాంగ్‌ను ఓడించడానికి 25 నిమిషాలు పట్టింది. బ్రూస్‌లీ పొగరు మొత్తం దిగిపోయింది. పోరాటం అంత సేపు సాగడానికి శరీరంపై అదుపులేక పోవడమే కారణమని బ్రూస్‌లీ భావించాడు. తన దేహదారుఢ్యంపై దృష్టి సారించాడు. ప్రాక్టీస్.... ప్రాక్టీస్ ....ప్రాక్టీస్... అంతే! ఫలితం.... ఇప్పటి కుర్రాళ్లు కలలుగనే సిక్స్ ప్యాక్ దేహాన్ని బ్రూస్ నాలుగున్నర దశాబ్దాల క్రితమే సాధించాడు.
ఫిలిం గిర్రుమంటేనే ఆ కదలిక చిక్కేది..
జూలై 9, 1967.. వింగ్‌చున్‌కు తన శైలి జోడించి అభివృద్ధి చేసిన 'జీత్ కునే దో' గురించి బ్రూస్‌లీ ప్రపంచానికి ప్రకటించిన రోజు అది. బ్రూస్‌లీ మాటల్లో చెప్పాలంటే.. 'నిజమైన పోరాటాలు అనూహ్యంగా ఉంటాయి. అందుకే ఒక ఫైటర్ నీళ్లలాగా ఉండాలి. క్షణాల్లో పాదరసంలా కదలగలగాలి'. అదే బ్రూస్‌లీ వేగానికి కారణం. సినిమాల్లో అతడి కదలికలు కెమెరాకు అందేవి కావు. అందుకే బ్రూస్‌లీ పోరాట దృశ్యాలను ప్రదర్శించడానికి ఫిలింను సెకనుకు 32 ఫ్రేముల వేగంతో తిప్పాల్సి వచ్చేదంటారు. మాములుగా మనం చూసే సినిమాల వేగం. సెకనుకు 24 ఫ్రేములే!
1971 అక్టోబరు 3
బ్రూస్‌లీ హీరోగా నిర్మితమైన తొలి చిత్రం 'ది బిగ్‌బాస్' విడుదలైన రోజు అది. నిజానికది బ్రూస్‌లీ తొలిసినిమా ఏమీ కాదు. చిన్నప్పుడే బ్రూస్‌లీ కెమెరా ముందుకు వచ్చాడు. 1941లో ఏడాది వయసు కూడా లేని పసిగుడ్డుగా 'గోల్డేన్ గేట్ గర్ల్' సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత 'దికిడ్', 'యాన్ ఆర్ఫాన్స్ ట్రాజెడీ'... ఇలా 20 సినిమాల్లో నటించాడు. హాంకాంగ్ నుంచి వెళ్లే సమయానికి అతడు నటించిన ఆఖరు సినిమా 'ది ఆర్ఫన్' 1960లో విడుదలైంది. చైనీస్ టాప్−100 సినిమాల్లో ఈ సినిమాకు 52వ స్థానం దక్కింది. అమెరికాకు వెళ్లాక 1959 నుంచి 1964 దాకా బ్రూస్‌లీ ఫిలీం కెరీర్‌వైపు చూడలేదు. లాంగ్‌బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్‌లో 'వన్ ఇంచ్ పంచ్' ప్రదర్శనే అతడికి సినిమా అవకాశాలనూ తెచ్చిపెట్టింది.
విలియం డోజియర్ అనే అమెరికన్ దర్శకనిర్మాత 'నంబర్‌వన్ సన్' అనే టీవీ సిరీస్ కోసం అడిషన్‌కు పిలిచాడు. అందులో ఛాన్స్ దొరకలేదు కానీ... అదే డోజియర్ తీసిన గ్రీన్ హార్నెట్ సిరీస్‌లో పాత్ర దక్కింది. ఆ తర్వాత వరుసగా పలు టీవీ సిరీస్‌లలో నటించాడు బ్రూస్‌లీ. 1969లో 'మార్లోవ్' సినిమాలో పిరికి డిటెక్టీవ్ సహాయకుడిగా చిన్నపాత్రలో కనిపించాడు. అమెరికా వెళ్లాక అదే అతడు పెద్ద తెరపై కనిపించడం. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఫైట్స్ కూడా కంపోజ్ చేశాడు. తన జాతీయత కారణంగా అక్కడ చిన్నచిన్న పాత్రలే వస్తుండడం వల్ల విసిగి హాంకాంగ్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే.. అమెరికాలో సూపర్ హిట్టయిన అతడి గ్రీన్ హార్నెట్ సిరీస్ హాంకాంగ్‌లో కూడా అంతే ప్రజాదారణ పొందిందన్న విషయం బ్రూస్‌కు అక్కడికి వెళ్లేదాకా తెలియదు. ఆ ప్రాచుర్యంతోనే గోల్డెన్ హార్వెస్ట్ తీసే రెండు సినిమాల్లో నటించడానికి సంతకం చేశాడు. వాటిలో మొదటిదే 'ది బిగ్‌బాస్'. మార్షల్ ఆర్ట్స్ మాజాను ప్రేక్షకులకు రుచిచూపించిందా సినిమా.
ఆ విజయాన్ని చూడకుండానే కన్నుమూత..
1972లో బ్రూస్‌లీ హీరోగా నటించిన రెండోసినిమా 'ఫిస్ట్ ఆఫ్ ప్యూరీ' విడుదలైంది. ఆ సినిమా రాకతో అంతకు ముందున్న రికార్డులన్నీ బద్దలైపోయాయి. తర్వాత తన సొంత సినిమా కంపెనీ కంకార్డ్ ప్రొడక్షన్ స్థాపించాడు. తన మూడో సినిమా 'వే ఆఫ్ డ్రాగన్' (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్)కు రచయిత, దర్శకుడు, నటుడు, ఫైట్ మాస్టర్.. అన్నీ తనే అయ్యాడు. అదీ బంపర్ హిట్టే!
ఆ సినిమా తర్వాత 1972 అక్టోబరులో బ్రూస్‌లీ 'గేమ్ ఆఫ్ ది డెత్' సినిమాను ప్రారంభించాడు. నెల రోజులపాటు షూటింగ్ జరిగాక వార్నర్ బ్రదర్స్ 'ఎంటర్ ది డ్రాగన్' రూపంలో హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా విడుదల తేదీ అయిన 26 జూలై 1973కు సరిగ్గా ఆరు రోజుల ముందు దురదృష్టవశాత్తు బ్రూస్‌లీ మరణించాడు. ఆ సినిమా సాధించిన అద్భుత విజయాలను కళ్లారా చూసుకోకుండానే కన్నుమూశాడు. అదే విషాదం.
1973 జూలై 20.. అసలేం జరిగింది.?
'ఎంటర్ ది డ్రాగన్' షూటింగ్ కారణంగా.. 1972 అక్టోబరులో ఆగిపోయిన బ్రూస్‌లీ నాలుగో సినిమా 'గేమ్ ఆఫ్ ది డెత్' స్క్రిప్టు గురించి ఆ చిత్ర దర్శకుడు రేమాండ్ చో, బ్రూస్‌లీ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ చిత్ర కథానాయిక బెట్టీ ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత బ్రూస్‌లీకి విపరీతంగా తలనొప్పి ప్రారంభమైంది. బెట్టీ అతడికి ఈక్వజెసిక్ టాబ్లెట్ ఇచ్చింది. తర్వాత కొద్దిసేపటికి అతడు పడుకున్నాడు. కోటిమందిలో ఒకరికి మాత్రమే వికటించే టాబ్లెట్ అది.
కోటిమందిలో కాదు.... కోట్ల మందిలో ఒకే ఒక్కడు బ్రూస్‌లీ! అందుకేనేమో దురదృష్టవశాత్తు ఆ టాబ్లెట్ వికటించింది. అంతే.. ఆ పడుకున్న మనిషి మళ్లీ లేవలేదు! అలా 32 ఏళ్ల వయసులోనే బ్రూస్‌లీ లోకాన్ని విడిచిపోయాడు. బ్రూస్‌లీ మరణించడం వల్ల అతడి చివరి చిత్రమైన 'గేమ్ ఆఫ్ ది డెత్' కథను కొద్దిగా మార్చారు. మాఫియా నుంచి తప్పించుకోవడానికి నాటకం ఆడినట్లుగా స్క్రిప్టులో మార్పులు చేశారు. అందుకు అనుగుణంగా సినిమాలో వాడుకోవడానికి అతడి నిజమైన మృతదేహాన్ని ఉపయోగించారు.
కొడుకుదీ అనూహ్య మరణమే!
బ్రూస్‌లీ తన తల్లిదండ్రుల ఐదుగురు సంతానంలో నాలుగోవాడు. బ్రూస్‌లీ భార్య లిండా లీ. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు పరిచయం ప్రేమగా మారి పెళ్లితో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు బ్రాండన్ లీ, కూతురు షానన్ లీ. తండ్రి దగ్గరే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన బ్రాండన్ లీ తండ్రిలాగానే టెలివిజన్ సిరీస్‌తో తన కెరీర్ మొదలుపెట్టాడు. తండ్రిలాగానే ఆరేడు సినిమాలు చేసి ఉర్రూతలూగించాడు. తండ్రిలాగానే చిన్నవయసులోనే చనిపోయాడు. 'ది క్రో' సినిమా షూటింగ్ సమయంలో తుపాకీలో డమ్మీ బుల్లెట్‌కు బదులు పొరబాటుగా నిజమైన బుల్లెట్ ఉంచడం వల్ల.. అది తాకి ప్రాణాలు కోల్పోయాడు. సియాటెల్‌లో ఆ తండ్రీ కొడుకులిద్దరి సమాధులూ పక్కపక్కనే ఉంటాయి.