సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు 'ఆస్కార్' ప్రదానోత్సవం లాస్ ఏంజిలెస్లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఎందరో అతిరథ మహారథుల సమక్షంలో విజేతలు అకాడమీ అవార్డులను అందుకొన్నారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రం ఫలితం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సినీ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ 'పారాసైట్' ఉత్తమ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆస్కార్ చరిత్రలో ఓ విదేశీ సినిమా ఉత్తమ చిత్రంగా నిలవడం ఇదే తొలిసారి. ఈ మూవీకి బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించాడు.
ఆస్కార్ అవార్డు బరిలో దిగిన ఈ సినిమా.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లోనూ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాంగ్ జూన్ హూ మనసులో మాటలు పంచుకున్నాడు.
"వయసులో ఉన్నప్పుడు నేను సినిమా గురించి చదువుతున్న రోజుల్లో నా మనసులో నిలిచిపోయిన ఓ మాట ఉంది. 'మనం ఏదైతే వ్యక్తిగతంగా భావిస్తామో అందులో సృజనాత్మకత ఉంటుంది.' పాఠశాలలో ఉన్నప్పుడు ఎక్కువగా మార్టిన్ స్కోర్సెన్ చిత్రాలను చూసేవాడిని. ఈ అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదు."
బాంగ్ జూన్ హొ, పారాసైట్ చిత్ర దర్శకుడు
ఓ వైపు ఉత్తమ చిత్రంగా 'పారాసైట్' నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచగా.. బ్రిటన్ దర్శకుడు సామ్ మెండిస్ తెరకెక్కించిన '1917' చిత్రానికి పురస్కారం రాకపోవడం అభిమానులకు నిరాశ మిగిల్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డు పొందిన తొలి దక్షిణ కొరియా సినిమాగా 'పారాసైట్' చరిత్రలో నిలిచింది.
పాశ్చాత్య ప్రేక్షకులకు బాంగ్ చిత్రాలు కొత్తేం కాదు. గతంలో 'మెమొరీస్ ఆఫ్ మర్డర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణ కొరియా సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.
కథేంటంటే...
ఓ పేద కుటుంబంలోని నలుగురు వ్యక్తులు.. కడుపు నింపుకోవడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో.. ఉద్యోగాల కోసం ఓ ధనిక కుటుంబం పంచన చేరుతారు. తామంతా ఒకే కుటుంబం అన్న విషయాన్ని యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాలు చేస్తున్న వారిని మోసపూరితంగా ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహార యాత్రకు వెళ్లినప్పుడు ఆ ఇంటిలోని సౌకర్యాలను అనుభవిస్తూ దర్జాగా గడిపేస్తుంటారు. అయితే తమ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి వీరంతా ఒకే కుటుంబం అన్న విషయం తెలిసిపోతుంది.
ఆలోపు యజమాని కుటుంబం తిరిగి వచ్చేస్తోందన్న సమాచారం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తమ బండారం బయటపడితే ఉద్యోగాలు పోతాయన్న భయంతో వాళ్లేం చేశారు? అనే విషయాలతో పారాసైట్ చిత్రం తెరకెక్కింది. పేద, ధనిక వర్గాల అంతరాల వల్ల సమాజంలో నెలకొన్న కఠిన పరిస్థితులకు వినోదాన్ని జోడించి దర్శకుడు బాంగ్ జూన్ హూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని టెలివిజన్ సిరీస్ రూపంలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.