జమ్మూ-కశ్మీర్ అంశంలో 'ఆర్టికల్ 370'ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతల కన్ను దీనిపై పడింది. ఈ విషయానికి సంబంధించి వివిధ టైటిల్స్‌ను రిజిస్టర్ చేయిస్తున్నారు. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో వీలైనన్ని పేర్లు నమోదు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆర్టికల్ 370','కశ్మీర్ హమారా హై' అనే వాటిని ఇప్పటికే రిజిస్టర్ చేశారని సమాచారం.
"ఈ అంశంపై సినిమాలు తీసేందుకు కొందరు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా చర్చిస్తున్న అంశం ఇదే. ప్రజలు కూడా దీని గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే అంతా సవ్యంగానే ఉంది. కానీ రానున్న రోజుల్లో నమోదు చేసే టైటిల్స్ సంఖ్య పెరగొచ్చు. ఒకసారి కథ రెడీ అయితే నిర్మాతలు పేరు రిజిస్టర్ చేస్తారు. అదే విధంగా పుల్వామా దాడి తర్వాత ఎక్కువగా టైటిల్స్ నమోదు చేశారు. అయితే ఒక్కదానికి మాత్రమే అనుమతిచ్చాం. మిగతావన్నీ తిరస్కరించాం."
-ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లోని ఓ వ్యక్తి
దేశంలో ఏదో ఒక చర్చనీయాంశమైన విషయం జరిగినపుడు... వాటిపై కథల్ని తయారు చేసి సినిమాలు తీసేందుకు సిద్ధమవుతుంటారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నారని, నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్నారని ఇప్పటికే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇది చదవండి: 370 రద్దుతో కశ్మీర్లో వచ్చే మార్పులివే...