బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అవార్డు తీసుకున్నారు. సెప్టెంబరులోనే ఆయనకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు.
కొద్దిరోజుల క్రితమే ఈ పురస్కారాన్ని అమితాబ్ స్వీకరించాల్సినప్పటికీ అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయారు. అప్పుడు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
ట్రాక్ రికార్డు...
అమితాబ్ ఇప్పటివరకు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. 4 జాతీయ పురస్కారాలు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన యాంగ్రీ యంగ్‌మన్‌గా పేరు తెచ్చుకున్నారు. కాలానికి తగినట్లు పాత్రలు ఎంచుకుంటూ నటనలో నూతన మైలురాళ్లు అందుకున్నారు.
చలనచిత్ర సీమలో విశిష్ట సేవలకుగానూ ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. గతేడాది బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు అందజేశారు. అంతకుముందు తెలుగు దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ సొంతం చేసుకున్నారు.
తొలిసారిగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు 65 మంది సినీ ప్రముఖులకు ఈ అవార్డును అందజేశారు.