ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పుడూ షూటింగులతో బిజీగా గడిపే దర్శకులు, నటీనటులు.. ప్రస్తుతం కొవిడ్ భయాందళనల మధ్య ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బాలీవుడ్ పరిశ్రమ ఈ మహమ్మారి కుదుపునకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున షూటింగ్, మార్కెటింగ్, ప్రమోషన్, పంపిణీ సహా సినిమాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా గడిచిన ఐదు నెలల్లో హీందీ పరిశ్రమ రూ. 2,500 నుంచి 3 వేల కోట్ల భారీ నష్టాలను భరించాల్సి వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు గిరీశ్ జోహార్ తెలిపారు. తాజాగా, ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మరోవైపు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మునపటి కంటే తక్కువ వ్యక్తులతో షూటింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ క్రమంలోనే చిత్రసీమపై ఆధారపడి జీవిస్తున్న చాలా మంది జీవనోపాధిపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని గిరీశ్ పేర్కొన్నారు. ఫలితంగా సగం మంది కార్మికులు తమ ఉద్యోగాలను శాశ్వతంగా కోల్పోయారని అభిప్రాయపడ్డారు.
ఓటీటీవైపు అడుగులు
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 14 వేలకు పైగా థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా 2 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయినట్లు గిరీశ్ పేర్కొన్నారు. మరోవైపు విడుదలకు నోచుకోని సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలే పలు దేశాల్లో కొన్ని మార్గదర్శకాల ప్రకారం థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చారు. దీంతో కార్మికులకు కాస్త ఉపశమనం కలిగినప్పటికీ.. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు.
బిగ్ సెలెబ్రెటీల సినిమాలు వాయిదా
ఓ వైపు నష్టపోయిన డబ్బును ఎలా తిరిగి పొందాలా అని బాలీవుడ్ నిర్మాతలు ఆందోళన చెందుతుండగా.. మహమ్మారి వ్యాప్తి మధ్య చిత్రీకరణలంటేనే నటీనటులు భయపడుతున్నారు. కరోనా నివారణలో భాగంగా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. అది అందుబాటులోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో 'రాధే' తదుపరి షెడ్యూల్‌ను సల్మాన్‌ఖాన్ స్వయంగా 2021 వరకు వాయిదా వేశాడు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్‌లు నటిస్తున్న సినిమా షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ మాత్రం ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని షూటింగులు ప్రారంభించారు.
సమస్యకు ముగింపు ఎప్పుడు.?
ఇప్పుడున్న పరిస్థితులన్నీ చక్కబడాలంటే మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని గిరీశ్ అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల అనంతరం చిత్ర పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులతో పాటు నిరుద్యోగాన్ని ఎదుర్కొనే సూచనలున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే భారీ నష్టాల్లో కూరుకుపోయిన చిత్ర సీమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తక్షణ ఉపశమనం అవసరమని సూచించారు.