అగ్ర కథానాయకులు ఏ దర్శకుడితో కలిసి సినిమా చేసినా అది ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటుంది. ఇక అప్పటికే కలిసి చేసిన దర్శకుడితో సినిమా చేస్తున్నారంటే పాత సినిమాల తాలూకు స్థాయి, ఆ ఇమేజ్.. అన్నీ కలిసి అంతకుమించిన స్థాయిలో అంచనాలు పెరిగిపోతుంటాయి. ఇక విజయవంతమైన సినిమా తర్వాత మరోసారి ఆ కలయికలో సినిమా అంటే మార్కెట్ పరంగానూ ఎన్నెన్నో లాభాలు. అందుకే నిర్మాతలు అలాంటి కాంబినేషన్లను కుదిర్చే ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈసారి కొత్తగా
ఇంతకుముందు కలయికల్లో సినిమాలే అయినా ఈసారి కథలతోపాటు ఆయా హీరోలు కనిపించే విధానంలోనూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం 1920 నేపథ్యంలోకి వెళ్లారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో ఓ కల్పిత గాథని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఆయన ఇదివరకు చేసిన సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో సాగే చిత్రమిది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేష్‌ని పెద్దోడిగా చూపించిన శ్రీకాంత్ అడ్డాల, ఈసారి ఆయన్ని ఓ మొరటు మనిషిగా ప్రతీకార కథలో చూపించబోతున్నారు. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల్లో అల్లు అర్జున్‌ని ప్రేమికుడిగానే చూపించారు సుకుమార్. ఈసారి మాత్రం వాటికి పూర్తి భిన్నంగా, అటవీ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ కనిపిస్తున్న విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బోయపాటి కూడా గత చిత్రాలకి భిన్నంగా బాలకృష్ణని కొత్త చిత్రంలో ఆవిష్కరించనున్నారు.
![Bollywood hit combinations are Repeating again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7897690_1.jpg)
'నారప్ప' కోసం...
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తర్వాత వెంకటేష్ - శ్రీకాంత్ అడ్డాల కలిసి మరో సినిమా చేస్తున్నారు. అదే 'నారప్ప'. తమిళ చిత్రం 'అసురన్'కి రీమేక్‌గా రూపొందుతోంది. 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్‌శంకర్ కలయికలో మరో సినిమా పక్కా అయ్యింది. వచ్చే ఏడాది ఆ చిత్రం పట్టాలెక్కబోతోంది. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ 'టక్ జగదీష్' కోసం కలిశారు.
![Bollywood hit combinations are Repeating again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7897690_2.jpg)
మూడోసారి
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయిక అంటే అభిమానులకే కాదు, సగటు మాస్ ప్రేక్షకులకూ పండగే. ఆ కలయికలో మూడోసారి సినిమా రూపొందుతోంది. ఇదివరకు బాలకృష్ణ - బోయపాటి కలయికలో 'సింహా', 'లెజెండ్' చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. అవి ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్ అంచనాల్ని మరింత పెంచింది. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలోనూ మూడో సినిమా రాబోతుంది. 'ఆర్య', 'ఆర్య2' తర్వాత ఈ కలయికలో వస్తోన్న చిత్రమే 'పుష్ప'. త్వరలోనే చిత్రం తిరిగి పట్టాలెక్కబోతోంది.
![Bollywood hit combinations are Repeating again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7897690_3.jpg)
తారక్ నాలుగోసారి... చరణ్ రెండోసారి
అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమా అంటే అందులోని పాత్రలు పోత పోసినట్టు ఉంటాయి. ఈ నటుడి కోసమే ఈ పాత్ర పుట్టిందేమో అన్నంతగా అలరిస్తుంటాయి. అలాంటి దర్శకుడితో మళ్లీ మళ్లీ సినిమా చేసే అవకాశం అంటే అది విశేషమే. అలా ఎన్టీఆర్ నాలుగోసారి రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్నారు. 'స్టూడెంట్ నెంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' చిత్రాల తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం ఈ ఇద్దరూ మరోసారి కలిశారు. ఇందులో మరో హీరో రామ్‌చరణ్ కూడా ఉన్నారు. ఆయన ఇదివరకు రాజమౌళితో 'మగధీర' చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం రెండోసారి రాజమౌళితో జట్టు కట్టారు.
![Bollywood hit combinations are Repeating again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7897690_4.jpg)
విజయవంతమైన కలయిక, క్రేజీ మల్టీస్టారర్, ప్రపంచస్థాయిలో అలరించిన 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా.. ఇలా ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.