Bheemla nayak Titile Song : అమ్మానాన్నలది పశ్చిమ గోదావరి జిల్లా. అమ్మది నర్సాపురం. నాన్నది తాడేపల్లిగూడెం వద్ద పిప్పర. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్(బైపీసీ) వరకు ఇక్కడే చదివా. ఎంసెట్‌లో ఉచిత సీట్ రావడంతో ఖమ్మంలో మమత దంత కళాశాలలో బీడీఎస్ చేశాను. అప్పట్లో కళాశాల క్రికెట్ జట్టు సారథిని. నా ఆట, పాటలను స్నేహితులు ప్రోత్సహించేవారు. ఇప్పటికీ సినీ కళాకారులతో క్రికెట్ ఆడతా.
సంగీతంలో ఓనమాలు.. సాధన
Singer Arun Kaundinya : అమ్మ ప్రోద్బలంతో ఒకటో తరగతిలోనే టీచర్లు.. సుహాసిని, లక్ష్మీ సుబ్రహ్మణ్యం వద్ద సంగీత సాధనకు చేరా. 18 ఏళ్లుగా రామాచారి వద్ద లలిత సంగీతం నేర్చుకుంటున్నా. సినిమాల్లో పాడతానని అనుకోలేదు. బీడీఎస్ తర్వాత జెమిని టీవీలో ‘బోల్ బేబి బోల్’ షో కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. సంగీత దర్శకుడు కోటి నా పాటలు విని 2013లో ‘జీ సరిగమప’లో వాయిస్ ట్రైనర్‌గా అవకాశం ఇచ్చారు. 13 సీజన్లు పనిచేశా. సంగీత దర్శకుడు తమన్ ‘నాయక్’లో కోరస్ పాడే అవకాశం ఇచ్చారు. మణిశర్మ, అనూప్‌రూబెన్స్.. ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా’ పాట పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటతో నా పాటల ప్రస్థానం మొదలైంది. 15 గీతాలు పాడి, 150 చిత్రాలకు కోరస్ అందించా.
కుటుంబ నేపథ్యం..
Bheemla nayak Singer Arun Kaundinya : అమ్మ ఇందిర.. వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుని నర్సాపురంలో శిక్షణ ఇచ్చేవారు. ఆమె పుట్టినరోజు నవంబరు 2. గత ఏడాది అదే రోజు అమ్మ మరణించడం మాకు తీరని లోటు. నేను పాడిన భీమ్లా నాయక్ పాటను వినడానికి ఆమె లేకపోవడం బాధగా ఉంది. నాన్న మురళీకృష్ణశర్మ ఎయిర్‌ఫోర్స్‌లో, ఎల్‌ఐసీలో పనిచేశారు. గిటార్ బాగా వాయిస్తారు. నా భార్య మైథిలి, తమ్ముడు, మరదలు అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే.
‘లాలా.. భీమ్లా..’ పాటకు ప్రత్యేకత
Bheemla nayak Movie : లాలా.. భీమ్లా.. గీతాన్ని పాడించేందుకు భిన్నమైన గళం కోసం వెతికారు. ఆ విషయం తెలిసిన సహచర గాయకుడు శ్రీకృష్ణ.. తమన్‌కు నా పేరు సూచించారు. ఆయన నన్ను పిలిపించి అటవీ తెగల(ట్రైబల్) ఫీల్ ఉండాలన్నారు. కొద్దిగా గొంతు మార్చి పాడాను. దర్శకుడు త్రివిక్రమ్ ఆ పాట రాశారు. పాట ప్రోమో తీసేందుకు కొరియోగ్రాఫర్ ఫాల్గుణి ఆధ్వర్యంలో 30 మంది ఒరియా కళాకారులతో నృత్యం చేయించారు. దీంట్లో 15 మంది వర్ధమాన గాయనీమణులూ ఉన్నారు. పాట వీడియో నాతో చేయించగా బాగా వచ్చిందని పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు.
ఇవీ చదవండి :