Bhavana Menon news: ఐదేళ్ల తర్వాత తనకి ఎదురైన కష్టాల గురించి మరోసారి ధైర్యంగా మనసు విప్పింది కథానాయిక భావన. మలయాళం, తమిళంతోపాటు, తెలుగులోనూ కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెపై ఐదేళ్ల కిందట జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భావనని అపహరించి, దాడి చేసిన ఘటనలో మలయాళ ప్రముఖ నటుడు దిలీప్ జైలుకి వెళ్లొచ్చారు. ఆ ఉదంతం, తదనంతర పరిణామాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తన అంతరంగాన్ని బయటపెట్టింది భావన.
"ప్రాణాలతో బయట పడటం నుంచి బాధితురాలిగా కొనసాగడం వరకు.. ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. ఇప్పటికి ఐదేళ్లయింది. నాపై జరిగిన దాడి భారంతో నా పేరు, గుర్తింపు అన్నీ మరుగునపడిపోయాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను కించపరుస్తూ.. ఒంటరిగా, మౌనంగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అలాంటి సమయంల్లోనూ నా స్వరాన్ని సజీవంగా ఉంచుకునేలా కొంతమంది అండగా నిలిచారు. నా కోసం చాలా గొంతులు మాట్లాడాయి. ఇప్పుడు న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో నేను ఒంటరిని కానని నాకు తెలుసు. న్యాయం గెలవడం కోసం తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడడం కోసం, మరెవరికీ అలాంటి కష్టాలు రాకుండా చూడటం కోసం నేను ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తా. నావైపు నిలిచినవాళ్లందరికీ ధన్యవాదాలు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖను భావన షేర్ చేసింది.
ఇదీ చూడండి: సీనియర్ నటీమణులు ఖుష్బూ, శోభనకు కరోనా