ఎప్పుడో 1740లో ఓ రచయిత్రి ఓ కథ రాసింది..
ఆ కథ ఆధారంగా 2017లో సినిమా తీశారు..
అది 126 కోట్ల డాలర్లను కురిపించింది.
పదకొండేళ్లకే తల్లిని కోల్పోయి, ఓ ధనవంతురాలి సాయంతో చదువుకున్న జియానే మేరీ లేప్రిన్స్ డెబ్యూమాంట్ అనే ఫ్రెంచి రచయిత్రి రాసిన కథ వందల ఏళ్ల తరువాత కూడా పాఠకులను, ప్రేక్షకులను పెద్ద, చిన్న తేడా లేకుండా ఆకట్టుకోవడం విశేషం. ఈ కథ ఆధారంగా వాల్ట్‌డిస్నీ సంస్థ 1991లోనే ఓ యానిమేషన్ సినిమాను తీసింది. దాన్ని 25 మిలియన్ డాలర్లతో తీస్తే అప్పట్లోనే 425 మిలియన్ డాలర్లు కురిపించి సంచలనం సృష్టించి.. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్‌లాంటి అవార్డులు గెలుచుకుంది. తిరిగి అదే సంస్థ, అదే కథ ఆధారంగా 2017లో సరికొత్త సాంకేతిక మాయాజాలంతో లైవ్ యాక్షన్ సినిమాగా తీస్తే అది కూడా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైంది.- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంతగా ఏళ్ల తరబడి, తరతరాలుగా ఆకట్టుకున్న కథ ఏంటి?
అనగనగా ఓ రాకుమారుడు. అతడికి అహంకారం ఎక్కువ. ఓ తుపాను నాటి రాత్రి, ఓ దేవకన్య బిచ్చగత్తె రూపంలో వచ్చి ఆ రాత్రి తలదాచుకోనివ్వమని కోరి, ఓ గులాబీని కానుకగా ఇవ్వబోతుంది. ఆ రాకుమారుడు పొగరుతో ఆమెను బయటకి గెంటిస్తాడు. అప్పుడు దేవకన్య తన నిజరూపాన్ని చూపించి శపిస్తుంది. దాని ఫలితంగా అతడు ఓ వికృత రూపం గల రాక్షసుడిగా మారిపోతాడు. అతడి కోటలోని సేవకులంతా రకరకాల వస్తువులుగా మారిపోతారు. మరి శాప విమోచనం ఏమిటి? ఆ రాక్షసుడు ఓ అందమైన అమ్మాయి మనసు గెలుచుకోవాలి. ఆమె ప్రేమతో అతడికి ఓ ముద్దు పెట్టాలి.
ఇదంతా ఆ పెరట్లో ఓ అందమైన గులాబీ పువ్వు ఆఖరి రేకు రాలి పడిపోయేలోగా జరగాలి. లేకపోతే అతడు ఎప్పటికీ రాక్షసుడిగానే మిగిలిపోతాడు. ఏళ్లు గడుస్తున్నాయి. ఒక్కో ఏడాది గులాబీ రేకు పడిపోతోంది. ఇక ఆఖరికు ఒకే ఒక రేకు ఉంది. అప్పుడా కోటలోకి ఓ వ్యక్తి వచ్చి, తన కూతురు కోసం ఓ గులాబీని కోసుకుంటాడు. ఆ రాక్షసుడు కోపంతో అతడిని బంధిస్తాడు. తండ్రిని విడిపించడం కోసం అతడి కూతురు ఆ కోటలోకి వస్తుంది. ఆమెను ఎలాగైనా మంచి చేసుకోవాలని ఆ కోటలోని వస్తువులన్నీ ప్రయత్నిస్తాయి. అవన్నీ ఆమెతో మాట్లాడుతూ, నవ్విస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ రాక్షసుడు కూడా తన అహంకారాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకుని శాపవిమోచనం కోసం ప్రయత్నిస్తాడు. మరి అతడి వికృత రూపాన్ని చూసి భయపడకుండా ఆ అమ్మాయి అతడిని ప్రేమించిందా? అతడి మంచి మనసును మెచ్చుకుని ముద్దు పెట్టిందా? అనేదే కథ.
* పాటలతో, నృత్యాలతో, అద్భుత సాంకేతికతతో మ్యూజికల్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రంగా 'బ్యూటీ అండ్ ద బీస్ట్' (2017)ను ప్రముఖ దర్శకుడు బిల్ కాన్డన్ రూపొందిస్తే, అందాల తార ఎమ్మా వాట్సన్, డేనియల్ స్టీవెన్, ల్యూక్ ఎవాన్స్ తదితరులు నటించారు. దీన్ని 255 మిలియన్ డాలర్ల వ్యయంతో తీస్తే ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డులు నెలకొల్పింది. ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలుచుకుంది.
* ఈ సినిమాలో బాల్‌రూమ్ డ్యాన్స్ సన్నివేశంలో కథానాయిక ఎమ్మా వాట్సన్ కోసం కుట్టించిన గౌనును తయారు చేయడానికి 3,000 అడుగుల దారం అవసరమైంది. ఏకంగా 12,000 పని గంటలు పట్టింది. ఆ గౌను మీద 2,160 క్రిస్టల్స్‌ను కుట్టారు.