బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ కథానాయికలు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఆస్పత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని రాత్రివేళల్లో బాలకృష్ణ, పూర్ణలపై చిత్రీకరిస్తున్నారు.
సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. బాలకృష్ణ ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో విజయవంతమైన 'సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత రూపొందుతున్న చిత్రమిది.
కథ మెచ్చారా?
విరామం లేకుండా సినిమాలు చేస్తుంటారు బాలకృష్ణ. ఒక సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే, మరో చిత్రం కోసం కథ పక్కా చేసేస్తుంటారు. తదుపరి చిత్రం కోసం పలువురు దర్శకులు బాలకృష్ణకు కథలు వినిపించారు. ఇదివరకు ఆయనతో సినిమా తీసిన ఓ యువ దర్శకుడు చెప్పిన కథనీ ఇటీవలే విని అంగీకారం తెలిపారని ప్రచారం సాగుతోంది. మరి బాలయ్య తదుపరి సినిమా ఎవరితో అనేది పక్కాగా తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.