నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుత పాత్రల్లో నటించారు. వాటిల్లో 'ఆదిత్య 369' ఒకటి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆణిముత్యంగా నిలిచి.. నేటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది ఈ సినిమా. టైమ్ మిషన్( భూత, భవిష్యత్, వర్తమాన కాలాల) నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను సమ్మిళితం చేసి ఈ చిత్రాన్ని.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఈ కథాంశానికి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విడుదలై జులై 18తో 30 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా బాలయ్య తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
![Aditya 369](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12491156_adi.jpg)
![Balakrishna Aditya 369](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12491156_adi-1.jpg)
"నా 'ఆదిత్య 369' విడుదలై నేటికి 30 ఏళ్లు దాటింది.. ఇంకా ఆదరణ పొందుతూ డిజిటల్ మీడియాలో ఈ తరాన్ని కూడా ఆకర్షిస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రపంచ సినీ చరిత్రలో సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, చరిత్ర ఈ మూడు జోనర్స్‌ను మేళవించి తెరకెక్కించిన అతికొద్ది చిత్రాలలో మనదేశం నుంచి బహుశా ఇదొక్కటేనేమో. ఇంతటి చిరస్మరణీయమైన దృశ్యకావ్యానికి నన్ను కథానాయకుడ్ని చేసిన దర్శకశాస్త్రవేత్త సింగీతం శ్రీనివాసరావుగారికి, నిర్మాతలు స్వర్గీయ ఎస్పీ బాలు గారికి, కృష్ణప్రసాద్ గారికి, నా ఊపిరితో సమానమైన నా అభిమానులకు, తరం మారినా ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు, సదా కృతజ్ఞుడ్ని."
-బాలకృష్ణ, కథానాయకుడు
ఈ చిత్రంలో విజయనగర రాజ్య కాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలం నుంచి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని కనబరిచారు బాలయ్య. ఆహార్యంలోనూ తన తండ్రి ఎన్టీఆర్‌ను తలపించారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన.. కష్టంతో కూడుకున్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. అమ్రీష్ పురి విలనిజం, రాజనర్తకిగా సిల్క్ స్మిత హొయలు, సైన్‌టిస్ట్‌గా టీను ఆనంద్.. నటనా పరంగా ప్రధాన బలాలు.
![Balakrishna Aditya 369](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12491156_adi-3.jpg)
సీక్వెల్ ఖరారు
ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ గురించి స్పందించారు బాలయ్య. త్వరలోనే సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తానని.. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. అలాగే ఈ మూవీలో తన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించబోతున్నాడని వెల్లడించారు. దీంతో ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
![Balakrishna Aditya 369](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12491156_adi-2.jpg)