'సైరా నరసింహారెడ్డి'.. ఈ సినిమా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టని మెగాస్టార్‌తో పాటు రామ్‌చరణ్ కూడా అనేక వేదికలపై చెప్పాడు. 'సైరా' కంటే ముందు స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జీవితగాథలో నటించాలనుకున్నాడట చిరంజీవి. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
"ఎప్పటికైనా ఓ స్వాతంత్య్ర సమరయోధుడి కథలో నటించాలని అనుకునేవాడిని. అలా రెండు దశాబ్దాల క్రితం నేను కచ్చితంగా చేసి తీరాలని అనుకున్న పాత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ పాత్ర. కానీ దురదృష్టవశాత్తు ఆయన కథతో ఎవరూ నా దగ్గరకు రాలేదు. కానీ పన్నెండేళ్ల క్రితం నా కలను పరుచూరి బ్రదర్స్ సైరాతో నిజం చేశారు" - మెగాస్టార్ చిరంజీవి
బాహుబలి చిత్ర విజయం 'సైరా'పై ఆశలు చిగురించేలా చేసిందని చెప్పాడు మెగాస్టార్ .
"పరుచూరి బ్రదర్స్ చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ నాకు బాగా నచ్చేసింది. అప్పటికి నా మార్కెట్, బడ్జెట్ పరిమితుల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కించడం సాధ్యపడలేదు. ఆ తర్వాత నేనూ రాజకీయాల్లో బిజీ అయిపోయా. కానీ బాహుబలి చిత్ర ఫలితం సైరాపై ఆశలు చిగురించేలా చేసింది. తెలుగు చిత్రసీమ మార్కెట్ ఎలాంటిదో ఆ సినిమా తెలియజేసింది"
-మెగాస్టార్ చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మించిన 'సైరా' చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అమిత్ త్రివేది సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: సైరాతో మాకు పోటీ లేదు: వార్ హీరో టైగర్