సోషల్‌మీడియాలో నకిలీ ఫాలోవర్స్ స్కామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముంబయి పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ ర్యాపర్ బాద్షాను ముంబయి పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
తన ఆల్బమ్ సాంగ్ 'పాగల్' వ్యూస్ పెంచేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు.. బాద్షా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. 7.2 కోట్ల వీక్షణల కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా రూ.72 లక్షలు చెల్లించాడని స్పష్టం చేశారు.
అయితే తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది. ఇతడితో పాటు బాలీవుడ్ ప్రముఖులు, పలువురు క్రీడాకారులతో సహా అనేకమంది సెలబ్రిటీలు ఇందులో భాగస్వాములయ్యారని దర్యాప్తులో తేలింది. అయితే వీరిలో ఎక్కువ మంది సంగీత కళాకారులే ఉన్నట్లు తెలిసింది. కానీ వారి వివరాలు తెలియలేదు.
ఈ రాకెట్లో బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రాకెట్ నడుస్తోందని పోలీసులు అంటున్నారు.
![badshah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8391617_1047_8391617_1597228325138.png)
సాఫ్ట్వేర్ ద్వారా
నకిలీ వీక్షణల కోసం బాట్స్, సర్వర్ ఫార్మ్స్ అనే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు పోలీసులు. బాద్షా కూడా ఇదే చేశాడని అన్నారు. దీనిపై త్వరలోనే ఓ స్పష్టతనిస్తామని తెలిపారు. కానీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు బాద్షా. తాను ఎలాంటి సాఫ్ట్వేర్లను వినియోగించలేదని.. కేవలం డబ్బులు మాత్రమే చెల్లించినట్లు స్పష్టం చేశాడు.
యూట్యూబ్‌లోనే బడా దందా
ఈ స్కామ్ అధికంగా యూట్యూబ్‌లోనే జరుగుతోందని తెలిసింది. ఈ సామాజిక మాధ్యమంలో పాపులారిటీ కోసం సంగీత దర్శకులు అడ్డదారులు తొక్కుతున్నారు. దాదాపు 40 నుంచి 360 మిలియన్ల రూపాయలు వరకు సగటున బదిలీలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగింది?
బాద్షా రూపొందించిన ఆల్బమ్ గీతం 'పాగల్'.. విడుదలైన 24 గంటల్లో 75 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ క్రమంలోనే టేలర్ స్విఫ్ట్, కొరియన్ బ్యాండ్ బీటీఎస్ రికార్డులను అధిగమించింది. అయితే గూగుల్ ఈ వాదనను తిరస్కరించింది. దీంతో నకిలీ ఫాలోవర్ల అంశం తెరపైకి వచ్చింది.
ఈ స్కామ్‌తో సంబంధముందనే అనుమానంతో పోలీసులు బాద్షాను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 20 మంది సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్‌తో సంబంధమున్న 54 సంస్థలను గుర్తించామని జాయింట్ కమిషనర్ వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు.