బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'అవతార్' మరోసారి రికార్డు నెలకొల్పింది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ రూపొందించిన సైన్స్ ఫిక్షనల్ చిత్రాన్ని ఈ వారం చైనాలో రీ-రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే రూ.25.44 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.20.33 వేల కోట్లతో ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' చిత్రాన్ని వెనక్కునెట్టి 'అవతార్' అగ్రస్థానానికి చేరింది.
'అవెంజర్స్: ఎండ్‌గేమ్' విడుదలకు ముందు ఈ రికార్డు 'అవతార్' పేరిట ఉంది. ఆ చిత్రాన్ని రెండుసార్లు విడుదల చేయడం వల్ల 'అవతార్'ను అధిగమించింది. చైనాలో శుక్రవారం వచ్చిన కలెక్షన్లతో అవతార్ చిత్రం మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాల్ట్‌డిస్నీ ప్రకటించింది. అయితే ఈ రెండు చిత్రాలను ప్రసార హక్కులను డిస్నీ సంస్థ చేజిక్కించుకోవడం విశేషం. 'అవతార్' చిత్రాన్ని 2009లో విడుదల చేయగా.. 'అవెంజర్స్:ఎండ్‌గేమ్' సినిమాను 2019లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
దర్శకుడు జేమ్స్ కెమెరూన్.. 'అవతార్'కు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. ఆ చిత్రాన్ని 2022 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: అసలు ఎవరీ 'సారంగ దరియా'!