బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి అరెస్టుపై ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌షిండే స్పందించారు. రియా అరెస్టు ఘటనలో న్యాయం అపహాస్యం పాలైందని వ్యాఖ్యానించారు. సుశాంత్ మాదకద్రవ్యాలకు బానిస అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ప్రేమించిన ఒక మహిళను మూడు కేంద్ర దర్యాప్తు బృందాలు వేటాడుతున్నాయని ఆరోపించారు. సుశాంత్ యాంగ్జైటీకి సంబంధించి తప్పుడు మందులు సూచించిన అతడి సోదరి ప్రియాంక, వైద్యుడిని ఎందుకు దర్యాప్తు చేయరని ప్రశ్నించారు. వాళ్లు సూచించిన తప్పుడు మందులు సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉండొచ్చు కదా అని అభిప్రాయపడ్డారు.
దేవుడు మా వైపే ఉన్నాడు
రియా చక్రవర్తి అరెస్ట్‌ను సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కృతి ఆహ్వానించింది. భగవంతుడు తమతోనే ఉన్నాడంటూ ఆమె ట్వీట్ చేసింది.
డ్రగ్స్ సరఫరాదారులతో రియా
రియా అరెస్టుపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు. డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ అధికారికంగా ఈ రోజు రియాను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. రియాకు డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు ఉన్నాయని ఈ అరెస్టుతో తేలిందన్నారు. దర్యాప్తులో ముంబయి పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపించారు. బిహార్ పోలీసులను కూడా దర్యాప్తునకు అనుమతించలేదని అన్నారు. ముంబయి పోలీసులు విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు.