Arjun Sarja sexual misconduct case: ప్రముఖ దక్షిణ భారత నటుడు అర్జున్ సర్జాకు లైంగిక ఆరోపణల కేసు నుంచి విముక్తి లభించింది. 'మీ టూ' ఉద్యమంలో భాగంగా నటి శృతి హరిహరన్ ఆరోపణలపై నమోదైన కేసులో క్లీన్చిట్ ఇచ్చారు పోలీసులు.
అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించారని నటి శృతి హరిహరన్ 'మీ టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపించారు. 2018లో 'విస్మయ' కన్నడ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఘటన జరిగిందని సోషల్ మీడియా వేదికగా నాలుగు పేజీల కాపీని పోస్ట్ చేశారు. ఈ కేసును బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు మూడేళ్ల క్రితం దర్యాప్తునకు స్వీకరించారు.
అర్జున్ సర్జాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. శృతి హరిహరన్ కూడా ఇప్పటివరకు రుజువులను సమర్పించలేకపోయారు. దీంతో ఈ కేసులో నటుడు అర్జున్‌పై అభియోగాలు మోపడానికి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు పోలీసులు తెలిపారు.
నటి ఆరోపణలతో కర్ణాటకలో అర్జున్ సర్జా అభిమానులు అప్పట్లో నిరసనలకు దిగారు. దీంతో నటి హరిహరన్ ఆరోపణలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఆఫ్సీసీ) జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఆ సమావేశానికి హాజరైన శృతి హరిహరన్.. తన ఆరోపణలను పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి:ఆ ముగ్గురికి నా జీవితంలో ప్రత్యేక స్థానం: బ్రహ్మానందం