Bheemla Nayak: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. ఈ సినిమా 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని థియేటర్లలో....మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విశాఖ జిల్లా అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ..పరిస్థితి ఇలాగే ఉంది.
తెలంగాణలో ఐదో ఆటకు అనుమతి
రాష్ట్ర వ్యాప్తంగా ‘భీమ్లానాయక్’ ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వకీల్‌సాబ్’ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో రానా మరో కీలక పాత్ర పోషించారు. సాగర్ కె.చంద్ర ‘భీమ్లా నాయక్’ను తెరకెక్కించారు. తమన్ సంగీత దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ సంభాషణలు అందించారు.
ఇదీ చదవండి: