నటి అనుపమ పరమేశ్వరన్ తన ప్రేమ, బ్రేకప్ గురించి బయటపెట్టింది. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని చెప్పింది. 'అ ఆ'తో మెప్పించి తెలుగువారికి చేరువైన ఈ మలయాళీ కుట్టి.. వరుస ప్రేమకథలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ భామ.. ఇన్‌స్టాలో అభిమానులతో ఇటీవల ముచ్చటిస్తూ, బ్రేకప్ విషయాన్ని వెల్లడించింది.
"ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. '18 పేజీలు', 'కార్తికేయ -2', 'రౌడీ బాయ్స్' చిత్రీకరణ దశలో ఉన్నాయి. కోలీవుడ్‌లో 'తల్లిపోగాదే'లో నటిస్తున్నాను. కన్నడ చిత్రపరిశ్రమను మిస్ అవుతున్నాను. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే అక్కడ కూడా సినిమాలు చేస్తాను" అని అనుపమ చెప్పింది.
అనంతరం తన ప్రేమ గురించి స్పందిస్తూ,ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 'గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్ అయిపోయింది' అని చెప్పింది. హీరో రామ్ పోతినేని తనకు మంచి స్నేహితుడని తెలిపింది. 'అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. పాటలు పాడటం కూడా ఇష్టమే. ఈ మధ్యకాలంలో పెయింటింగ్ నేర్చుకున్నాను. ఎప్పుడైనా ప్రశాంతత కావాలని భావించినప్పుడు వెంటనే పెయింటింగ్స్ వేస్తాను. దాంతో నా మనసు, హృదయం రెండూ సంతోషంగా మారుతాయి' అని ఆమె వివరించింది.
అనుపమ ప్రేమలో ఉందంటూ ఎన్నో సందర్భాల్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆమె ఓ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని ఆమె ఎన్నో సందర్భాల్లో సమాధానమిచ్చింది.