సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం తాను ఎన్నో సినిమా అవకాశాలు వదులుకున్నానని, నిజం తెలియకుండా అందరూ తనను నిందిస్తున్నారని అతని మాజీ ప్రేయసి అంకిత ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ గతేడాది జూన్ 14న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ టీవీ సీరియల్‌లో నటిస్తున్న సమయంలో సుశాంత్-అంకిత ఒకరినొకరు ఇష్టపడ్డారు. అలా దాదాపు ఆరేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్‌కు మరో నటి రియా చక్రవర్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే అసలు సుశాంత్‌తో ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్నలు అంకితకు ఎదురయ్యాయి. అయితే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆమె ఎట్టకేలకు స్పందించింది.
" 'నువ్వే సుశాంత్‌ను వదిలేశావు' అని అందరూ నన్ను అంటున్నారు. కానీ, నిజం ఎవరికీ తెలియదు. నేను సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో సినిమా అవకాశాలు వదులుకున్నా. షారుక్‌ఖాన్‌తో కలిసి 'హ్యాపీ న్యూ ఇయర్'లో చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ 'బాజీరావ్ మస్తానీ'లో, సల్మాన్ ఖాన్ 'సుల్తాన్'లో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. కానీ.. ఆ సమయంలో సుశాంత్‌ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో వాటన్నింటినీ కాదనుకున్నా. అవి ఎంత పెద్ద హిట్ సినిమాలో మీకు తెలుసు. అయితే.. వాటిని కాదనుకొని అప్పుడు తీసుకున్న నిర్ణయాల విషయంలో నేను ఇప్పటికీ చింతించడం లేదు. 'బద్లాపూర్' సినిమాలో చేయాలని వరుణ్ ధవన్ ఒకసారి కోరాడు. కానీ.. సుశాంత్ కోసం దాన్ని కూడా వదులుకున్నా. నేను సుశాంత్‌ను వదులుకోలేదు. అతనే నాకంటే తన కెరీర్ ముఖ్యమని అన్నాడు. అందుకే విడిపోవాల్సి వచ్చింది. అతని నిర్ణయానికి నేను గౌరవం ఇచ్చాను. అతను అలాగే ముందుకు వెళ్లిపోయాడు. సుశాంత్‌తో విడిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు ఎంత క్షోభ అనుభవించానో ఎవరికీ తెలియదు. సులభంగా మర్చిపోగల మనిషిని కాదు. అందుకే నా వృత్తి విషయంలోనూ వెనకబడిపోయాను. నిజానికి నా జీవితం అప్పుడే అయిపోయింది. అయినా.. నేను ఇప్పటికీ ఎవర్నీ తప్పుబట్టడం లేదు. సుశాంత్ తన దారి ఎంచుకున్నాడు. మా ఇద్దరి మార్గాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. నేను ప్రేమకోసం ఎంతో తపించాను" అని ఆమె వివరించింది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పింది.
ఇదీ చూడండి: సుశాంత్ కేసు ఛార్జిషీట్లో 33 మంది పేర్లు!