AP Cinema Tickets Issue : సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో ప్రేక్షకుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యాలకు ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. ధరల విషయంలో సినీ పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వాధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంది. ధరలను తామే నిర్ణయించే పరిస్థితి తీసుకురావద్దని వ్యాఖ్యానించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
AP High Court on Cinema Tickets : కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలు ముందస్తు సమాచారం ఇచ్చి సంయుక్త కలెక్టర్(జేసీ)లను సంప్రదించిన తర్వాతే టికెట్ ధరలను ఖరారు చేయాలని స్పష్టంచేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఈఏడాది ఏప్రిల్ 8న హోంశాఖ జారీచేసిన జీవో 35ను సవాలు చేస్తూ పలు సినిమా థియేటర్ యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. జీవో 35కు పూర్వం అనుసరించిన విధానాన్ని ధరల ఖరారు విషయంలో పాటించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది.
ప్రేక్షకులపైనే ధరల పెంపు ప్రభావం
Cinema Tickets Price Issue : సినిమా విడుదలైన ప్రతిసారి ధరల వివాదం కోర్టుముందుకు వస్తోందని గుర్తుచేసింది. యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరాటంలో కోర్టును తెరపైకి తెస్తున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ధరల ఖరారు విషయంలో లోపాలు జరుగుతున్నాయంది. అంతిమంగా ధరల పెంపు ప్రభావం చూపేది ప్రేక్షకులపైనే అని తెలిపింది. ధరలు పెంచి యాజమాన్యాలు, పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వమూ సంతోషంగా ఉన్నారని.. నష్టపోయేది సినీ ప్రేక్షకులు మాత్రమేనని పేర్కొంది. ధరలు అసాధారణంగా పెంచినా ప్రేక్షకులు తగ్గి నష్టపోతామనే విషయాన్ని యాజమాన్యాలు గుర్తించుకోవాలని సూచించింది.
జీవో 35 అమలులోనే ఉంది
AP Cinema Tickets Price Issue :సినిమా టికెట్ల ధరలకు సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 అమలులోనే ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ స్పష్టం చేశారు. ఆ జీవోపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, మినహాయింపులు ఏమైనా ఉంటే వారికే వర్తిస్తాయన్నారు. టికెట్ల ధరలకు సంబంధించి ఎలాంటి కమిటీని నియమించలేదని తెలిపారు.
- ఇదీ చదవండి : Cinema Tickets Issue AP : సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు