ప్రముఖ హాస్యనటుడు అలీని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సినిమా 'యమలీల'. ఈ చిత్రం నేటితో 26 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు, తదితర విషయాలు మీకోసం.
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉన్నాయి. తల్లిని దేవతలా ఆరాధించే కొడుకు పాత్రలో అలీ నటన అద్భుతమనే చెప్పాలి. అమ్మగా మంజుభార్గవి బాగా నటించారు. అయితే ఆద్యంతం సెంటిమెంట్‌తో పాటే సందర్భానుసారంగా వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్ర గుప్తుడిగా బ్రహ్మానందం, తోట రాముడిగా తనికెళ్ళ భరణి, పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా కోట శ్రీనివాసరావు, అలీ అసిస్టెంట్‌గా గుండు హనుమంతరావు... ఇలా సినిమాలోని చాలా పాత్రలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తాయి.
'యమలీల'లోని పాటలూ ఎంతో ఆదరణ పొందాయి. ఇందులోని 'సిరులొలికించే చిన్ని నవ్వులే' గీతం.. ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం, చిత్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. దీనితో పాటే అలీ, ఇంద్రజ మధ్య వచ్చే 'నీ జీను ప్యాంటు చూసి బుల్లోడా' సాంగ్ మాస్ ఆడియన్స్ చేత స్టెప్పులు వేయించింది. సూపర్‌స్టార్ కృష్ణ ఓ పాటలో తళుక్కున మెరవడం ఇందులోని మరో ప్రత్యేకత. 'జూంబారే జుజుంబరే..' పాట సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది. ఇందులో ఇంద్రజతో కలిసి కృష్ణ వేసిన స్టెప్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఓ చిన్న హీరోతో ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 'యమలీల'ను కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ప్రదర్శించారు.
ఇదీ చూడండి : ముద్దుగుమ్మ సన్నీ లియోనీ 'బ్రోకెన్ గ్లాస్'