"నా దృష్టిలో కథే హీరో. కథ బాగుంటే.. అందులో నా పాత్ర నిడివి తక్కువున్నా సరే నటించడానికి వెనకాడను" అన్నారు నటి నందితా శ్వేత. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా', 'శ్రీనివాస కల్యాణం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ కన్నడ కస్తూరి.. ఇప్పుడు 'అక్షర' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. చిన్ని కృష్ణ దర్శకుడు. సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు. శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నందిత.
- "ఈ చిత్రంలో ఎక్కువ విద్యావ్యవస్థ గురించి మాట్లాడనున్నాం. నేనిందులో లెక్చరర్‌గా కనిపిస్తా. ఈ సినిమా నా కెరీర్‌కు ఓ మలుపులా నిలుస్తుందని నమ్మకంగా ఉంది. నేను నటిస్తున్న తొలి నాయికా ప్రాధాన్య చిత్రమిది. అందుకే ఈ సినిమా ఒప్పుకోవడానికి తొలుత కాస్త భయపడ్డా. ఈ చిత్రం కోసం దర్శకుడు చిన్నికృష్ణ నన్ను పిలిచినప్పుడు..ఏదో హారర్ మూవీనేమో అనుకున్నా. కానీ, కథ విన్నాక ఎమోషనల్‌గా అనిపించింది".
- "పిల్లలు కాన్వెంట్‌లో చదవాలని తల్లిదండ్రులు అనుకుంటారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు నన్నలాగే కొన్నాళ్లు ఓ పెద్ద కాన్వెంట్‌లో వేశారు. ఆ ఏడాది నాకు అక్కడున్న వాళ్లతో కలవడానికి కష్టంగా అనిపించింది. ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని ఒత్తిడి చేసేవారు. చాలా ఇబ్బందిగా అనిపించేది. తర్వాత ఫీజు కట్టడం కష్టమవడం వల్ల.. తొమ్మిదో తరగతి నుంచి మళ్లీ ప్రభుత్వ స్కూల్‌కు వచ్చేశా. అప్పుడు నాకెంత తేలికగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. నాలాంటి కథే చాలా మంది విద్యార్థులకు ఉంటుంది".
- "ప్రస్తుతం 'రాజుగారి గది' ఫేం అశ్విన్ హీరోగా ఓ సినిమాతో పాటు తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తున్నా".
ఇదీ చూడండి: పెళ్లిపై విశాల్ స్పందన.. త్వరలోనే శుభవార్త!